పురస్కారం – జీడిగుంట నరసింహ మూర్తి

సదానందంకు ఏ పని చెయ్య బుద్ది కావడం లేదు.ఎప్పుడూ లేని ఏదో అవ్యక్తమైన బెదురూ, నీరసం ముంచు కొచ్చాయి. తను తన వృత్తి ధర్మంలో ఒక రకంగా ఘోరంగా అవమానింప బడ్డాడు. డబ్బయితే సంపాదించుకో గలిగాడు గాని అది తీరని అశాంతి మిగిల్చింది.. ప్రస్తుతం అనుక్షణం అతను తీవ్రమైన భావోద్రేకానికి ఎందుకు గురవుతున్నాడో ఒకసారి అతని గతంలోకి తొంగి చూస్తే కాని తెలుసుకోవడం కష్టం.

“ఈ పని మీ వల్ల కాదుకాని సదానందాన్ని పిలిపించండి. ఆ విషయం నా కెందుకు చెపుతారు సదానందానికి చెప్పొచ్చుగా!. అమ్మో సదానందానికి రెండు రోజులు లీవ్ ఇస్తే మొత్తం పనులు ఆగిపోవూ . మా కంపెనీ తరపున సదానందం అనే ఆయన వచ్చి మాట్లాడతాడు. “ ఈ సంభాషణలు తరచుగా వినిపించేవి ‘ మోస్ట్ వాంటెడ్ పర్సన్’ గా ఆ మేనేజ్మెంట్ గుర్తించిన సదానందం అనే అతని గురించి.

ఇంతకీ ఈ సదానందం ఎవరు ? ఆ కంపెనీలో ఎంతో మంది అర్హత గల వాళ్ళు ఉండగా కేవలం స్కూల్ ఫైనల్ వరకు చదివిన పొరుగు రాష్ట్రం నుండి దిగుమతి చేసుకున్న సదానందానికి అంత విలువ ఇవ్వడానికి కారణం? ఈ ప్రశ్నలు చాలా మందిలో ఉదయించినా దానికి సమాధానం ఒక్కటే. సదానందంతో కాని పనంటూ ఏమీ లేకపోవడం. తిమిని బిమ్మిని చేసైనా సరే రావనుకున్న కాంట్రాక్ట్లు , కాన్సిల్ అయిపోయిన లైసెన్సులు పునరిద్దరింప చెయ్యడం , ఇంకా ఎన్నో అసాధ్యమైన పనులను సుసాధ్యం చెయ్యగలగడం అతని పర్యవేక్షణలో క్షణాల్లో జరిగిపోతాయి. అందుకే .. అందుకే ఆ కంపెనీ అతనికి పట్టం కడుతోంది. .

మానేజ్మెంట్ పూర్తిగా కొండొకచో గుడ్డిగా ఆధారపడి పోవడంతో తను ఆడింది ఆటగా, పాడింది పాటగా చెలరేగి పోతూ ఆ సెక్షన్ లో పది సంవత్చరాల నుండి యదేచ్చగా అక్రమ ఆర్జన చేస్తూ సంచులు నింపుకుంటున్నా ఆ వింగ్ కు అతనే హెడ్ కావడంతో సదానందాన్ని ఎదుర్కునే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే అతనెంత అవినీతి పరుడైనా కూడా నివురుగప్పిన నిప్పులా ఉండి విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండటంతో పై వాళ్ళ నుండి అతని కెటువంటి అభ్యంతరాలు రాలేదు. అది అతనికి ఎంతో లాభించింది.

సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టు డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతోంది. సదానందం వల్ల లాభ పడుతున్న పార్టీలు అతనికి అనుక్షణం కొమ్ముకాస్తూ లోపాయికారిగా తమ పనులను చక్కబెట్టు కుంటున్నారు.

అయితే పరిస్తితులన్నీ మనం ఆశించినట్టుగా, శాశించినట్టుగా ఉంటాయని ఎవరూ అనుకోవడానికి వీల్లేదు. ఆ కంపెనీని అభివృద్దిలో భాగంగా వేరే కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవడంతో అనుకోకుండా చాలామంది పై ఆఫీసర్లు ఇటునుండి అటు అటునుండి ఇటు బదిలీ కావాల్సిన పరిస్తితి వచ్చింది. ఆ బదిలీలో భాగంగానే పరశురాం అనే ఉన్నతాధికారి ప్రవేశించాడు. అతను సదానందం పై ఆఫీసర్ గా నియమింపబడ్డాడు

CoolClips_vc024696ఈ హఠాత్తు పరిణామానికి సదానందం నీరుకారి పోయాడు. ఏదో ఘోరం జరగ బోతోందన్నట్లుగా అతని మనసు కీడు శంకిస్తోంది. ఇన్నాళ్ళు తన పగ్గాల్లో ఉన్న ఆఫీస్ వ్యవహారాలు ఇంకొకరికి పోబోతున్నాయి. ఈ మార్పుల వల్ల ఎన్నో లొసుగులు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటివరకూ తన చుట్టూ తిరిగిన పార్టీలు ఇప్పుడు అటువైపు పోతారు. ఇక తను మునుపులా జీవించే అవకాశం లేదు. పైగా ఆ వచ్చిన వ్యక్తి సాక్షాత్తు మానేజింగ్ డైరెక్టర్ గారి బావమరిది కూడాను. ఇక తన పప్పులు ఉడకవు. ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న తన అక్రమ ఆర్జనకు గండి పడటమే కాకుండా తన ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. మెల్ల మెల్లగా సదానందంలో భరించలేని ఉద్విగ్నత ఆవరిస్తోంది. అతని మెదడు ఆలోచనా శక్తిని కోల్పోతోంది. ఈ లోపు సీనియర్ అధికారి కన్ను సదానందంపై పడనే పడింది. ఆఫీస్ లోని ఫైళ్ళన్నీ చక చకా తనిఖీ అయిపోతున్నాయి. అందులో ఉన్నవన్నీ దొంగ కొటేషన్ లని తెలిసి పోయింది. బజారులో రూపాయికి దొరికే వస్తువును పది రూపాయలకు కొంటున్నట్టు బిల్లులు కనపడుతున్నాయి. ఎన్ని రకాలుగా మోసం చేయవచ్చో అన్ని రకాలుగా సదానందం ఆరితేరిన మోసగాడు, మొనగాడు అని ఒక్క రోజు తనిఖీలోనే తెలిసిపోయింది. ఆ క్షణం నుండి అప్పటి వరకు ఎవరెవరి నుండి ఆఫీస్ కు కొనుగోళ్ళు జరిగాయో అవన్నీ నిలిచి పోయాయి. అంతేకాదు వాళ్లకు రావాల్సిన బకాయిలు సయితం ఆగిపోయాయి. ఈ హఠాత్తు సంఘటనకు పార్టీలంతా ఊకుమ్మడిగా సదానందంపై దండయాత్ర మొదలు పెట్టారు. అన్ని రకాలుగా క్లూలు దొరికిన దరిమలా తప్పని సరైన పరిస్తితిలో సదానందం తను చేసిన అక్రమాలు ఒప్పుకోక తప్పలేదు. ఆ వెంటనే అతనికి ఫాక్స్ లో టెర్మినేషన్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇది అతనికి ఆత్మహత్యా సదృశ్యం. నిలువునా అవమానంతో క్రుంగి పోయాడు సదానందం.

సీనియర్ బాస్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన టెర్మినేషన్ ఒరిజినల్ ను సదానందం చేతికిస్తూ “ ఉత్తములు చేసిన పనిని ఇతరులు అనుకరించాలని కోరుకుంటారు.. వాళ్ళు నెలకొల్పిన ప్రమాణాలనే ఇతరులు ఆదర్శంగా తీసుకునే లాగా వ్యవహరించడం ప్రతి ఒక్కరి భాద్యత. మనమందరం సంస్థ అభివృద్దికి తోడ్పడుతూ ప్రతి విషయంలోనూ వీలయినంత వరకు నిజాయితీ చాటుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది.అప్ప్డుడే సంస్థతో బాటు పదికాలాలు మనం కూడా మన్నగలుగుతాం. దురదృష్ట వశాత్తు ఇతరుల అవసరాలను ఎన్క్యాష్ చేసుకోవాలని చూసే మీ లాంటి వాళ్ళు ప్రతి సంస్థలోనూ కనీసం ఒక్కళ్ళయినా వుంటారు. వాళ్లకు సంస్థ అభివృద్ధితో సంబంధం లేదు.

నమ్మించి వాళ్ళ పనులను చక్క బెట్టు కుంటారు. అది ఎంతో కాలం సాగదు. ఏదో ఒక రోజు పాపం పండక పోదు. ఇటువంటి తిరస్కారం తప్పించు కుందామన్నా తప్పదు.అయితే మీరు ఒక రకంగా అదృష్ట వంతులే.. ఒట్టి టెర్మినేషన్ తో సరి పోయింది. మంచో చెడ్డో అక్రమంగా సంపాదించుకున్నా కష్టపడి పని చేసారు కాబట్టి బ్యాంకు లోని మీ ఎకౌంట్స్ సీజ్ చెయ్యకుండా వదిలేస్తున్నాం.ఇకనుండైనా ఎక్కడైనా పని దొరికితే నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి..” అన్నాడు సీనియర్ ఆఫీసర్ ఇక వెళ్ళొచ్చు అన్నట్టుగా బయటకు చూస్తూ.

అక్కడే నిలబడి చూస్తున్న సదానందం క్రింద పని చేస్తున్న స్టాఫ్ “ సార్ సదానందం గారిని ఎక్కడున్నా మేము తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం. మా దృష్టిలో అతను ఓ రకంగా మంచి వాడి క్రింద లెక్కే. దానికి కారణం అతని అక్రమ సంపాదనలో ఏనాడూ మమ్మల్ని భాగస్వాములను చెయ్యలేదు. ఆ పాపాన్ని అంతటిని అతనొక్కడే మూట కట్టుకుని వెళ్లి పోతున్నాడు. ఒక వేళ మేము కూడా అతని అక్రమ ఆర్జనకు ఆశపడి ఉన్నా, లేక అందులో కొంత భాగం అతను మాకు ఇవ్వ జూపినా మేము కూడా మా ఉద్యోగాలకు తిలోదకాలిచ్చుకుని బయటక నడవాల్సి వచ్చేది. ఇందుకు సదానందం గారికి మేమెంతో రుణపడి వున్నాం “ అంటూంటే సదానందం పై అధికారి ముందు ఇంకొక్క క్షణం కూడా నిలువలేని పరిస్తితిలో అక్కడ నుండి బయటకు వెళ్లి పోయాడు తనకు లభించిన పురస్కారం కు లోలోపల కుమిలి పోతూ.

జీడిగుంట నరసింహ మూర్తి., ఫ్లాట్ నెంబర్ :401, సాయి లక్ష్మి ప్లాజా, అన్నపూర్ణ ఎన్క్లేవ్ , సాయిబాబా గుడి దగ్గర, చందానగర్, హైదరాబాద్ -500050 సెల్ : 9866187886
జీడిగుంట నరసింహ మూర్తి., ఫ్లాట్ నెంబర్ :401, సాయి లక్ష్మి ప్లాజా, అన్నపూర్ణ ఎన్క్లేవ్ , సాయిబాబా గుడి దగ్గర, చందానగర్, హైదరాబాద్ -500050 సెల్ : 9866187886

Share This Post

Leave a Reply