ఫోటో కవిత – 2

amma1amma 2

 

“కన్నతీపి”

గుక్కతిప్పని రెక్కల సమ్మెట
పేగుబంధం వీపు ఊయల మోపున
కన్నతీపి “తొమ్మిదో నెల”
కాలరేఖను దిగమింగింది
వొడిదుడుగు బతుకు పోరును ఎగజిమ్మింది…

                                                         – డా. ఎం.ఎన్.బ్రహ్మానందయ్య,

                                                          ఎం.ఏ.,టి.పి.టి.,సెట్.,నెట్, పిహెచ్.డి.
                                                             తెలుగు అధ్యాపకులు,
                                                                     తెలుగు శాఖ,
                                                                       ఆర్.కె.వ్యాలీ,
                                                                సెల్.నెం. 9704034854.

 

తల్లిని మించిన దైవం లేదు

 గతి తప్పని తల్లి మమత
 సుతుల కడుపు నింపుటకు
 సున్నితత్వమును మరచి
 సుత్తిని చేపట్టినది
 మతి తప్పని తల్లి మమత
 ఒక ఒరవడిని నేర్పించుటకు
 ఇంధనముగ తనను మలచి
 ఇటుకలనే ఎత్తినది
 ఒజ్జతనము చేసినా
 బొజ్జవైపు చూసినా
 తల్లితప్ప మురిపములిడ
 తరిలిరాలేరు ఎవరు.

                            –         నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి

**********************

రాళ్ళనూ
రాతి హృదయాలను
భరించేది
భద్రంగా దాచుకొని
తరించేది
సహనమూర్తి ఆడది
                          – ఖాన్

 

పొట్టకూటికోసం బండలు బద్దలు చేయక తప్పదు తల్లికి
అడ్డాలనాడే ఓ చెయ్యి వేసి తల్లికి సాయం చేస్తున్నాడు ఒక కొడుకు
తనూ నేర్చుకుని సాయపడదామని చూస్తున్నాడు పెద్దకొడుకు

–      వ.వె.నా.వరలక్ష్మి, విశాఖపట్టణము 

 

పొట్ట తిప్పల కోసం సంకలో చంటిపిల్లలతో ఎండలో రాళ్ళు కొడుతున్న చెల్లెలా

వీపున చంటిపిల్ల తలపై ఇటుకల భారం మోస్తున్నావా చెల్లి ..

–   పంజాల ఐలయ్య, 9440324881

 

“మనోధైర్యం సుత్తిదెబ్బకి ఆకలి కేకలేస్తూ పారిపోవాలి”— జోగారావు గుండాన

 

…….”అమ్మ “ఉంటే ..అన్నీ ఉంటయ్…..

బెడ్డతో పాటూ “బిడ్డ”నలిగితే ఏంటి ?
నాల్గు వేళ్ళూ..నలుగురి నోళ్ళూ..నింపాలిగా..మరి !

భార్య గా సంసారం తప్పునా.?.అమ్మగా
సాకటం గొప్పనా..?!

అమ్మ పాత్రలోనే..హాజరౌతుంది..మర్నాటికి
చాలనంత “కూలి” కోసం..!

జీవితాన్ని జారిపోకుండా జీవించడం కోసం

“ఓ తల్లీ.!” ఇలాంటిది..నీ వల్లే.. నీఒక్కదానివల్లే..
అవుతుంది ఈ అవనిపై..!

                       ……మనోజ నంబూరి, విజయవాడ

 

చిన్నప్పట్నుంచే 
రాళ్ళ లాంటి 
కఠిన జీవితాన్ని
పగలగొట్టి…
ఎలా జీవించాలో
బోధిస్తూంది తల్లి
ఒడిలో ఉన్న 
తన పిల్లల్ని!

                     — అంజాద్, సరూర్ నగర్, హైదరాబాదు

 

Share This Post

2 Comments - Write a Comment

 1. ఫోటో కవిత-2
  ——————–
  ఒంటరి పోరాటం
  ……………………
  ఒకపక్క పిల్లాడిని ఒళ్ళో పెట్టుకొని
  మరోపక్క ఇటుకలు మోస్తూ
  రెండు యంత్రాల శరీరంతో
  జీవితాన్ని ఏకకాలంలో
  ఒంటరి పోరాటం చేస్తున్నావు
  ఒక చేతిలో చంటోడ్ని ఉంచుకొని
  ఎర్రని ఎండలో మరో బిడ్డను పెట్టుకొని
  ఒంటిచేత్తో రాళ్ళను పిండి చేసి
  ఆకలి పోరాటానికి నిర్వచనమయ్యావు
  కాలం సుత్తి దెబ్బలకు
  జీవితాలు ఛిద్రమైపోతున్నప్పుడు
  వెలుగుల తీరాలకు
  ఎండమావుల్లా వెంపర్లాడడమే తప్ప
  ఒయాసిస్సుల వాసనే లేదు.
  ………………………………………………

  Reply
 2. ఫోటో కవిత-1
  ——————-
  ఎదురీత
  ————
  ఆ చూపులో ఏదో ఆర్తి
  అక్షరాలకు దూరమయ్యామనే వెలితి
  ఈ జన్మలో అది తీరదనే భ్రాంతి
  వాళ్ళను నిలువునా దహించి వేస్తోంది
  ఏమీ చేయలేని అసహాయులం
  అన్నానికి నోచుకోని అన్నార్తులం
  మాకు చదువులా చట్టుబండలా
  చదివి మేమేం ఊళ్ళేలాలి
  అక్షరాల్ని నాలుక చివర దాచేసుకొని
  పైకి గుడ్లప్పగించి చూడ్డం తప్ప
  ఆ చూసిన కాసేపు
  మమ్మల్ని మేము మరచిపోవడానికి
  మాలో మేము ఉత్తేజితులమవ్వడానికి
  ఈ క్షక్షాలు చాలు
  రేపటి ఆశలు చిగుళ్ళు తొడిగేందుకు
  పనిలో మాబాధలు మరిచేందుకు
  పనులెప్పుడూ ఉండేవే కష్టాల్లాగా
  జ్ణాణం ఇక్కడే దొరుకుతుంది
  మాలో అజ్ణాణాన్ని తొలగించే
  ఆ జ్ణానాన్ని మాకు ప్రసాదిస్తే
  మనుషులుగా తీర్చి దిద్దుకుంటాం
  మానవత్వాన్ని పెంచుకుంటాం.
  —————————————————

  Reply

Leave a Reply