ఉగాది శుభాకాంక్షలు – నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి

అహమును దరి రానీయని,సంవత్సర సహనపు
సామూహిక  సంస్కారమా , నమస్కారమమ్మా.
…………….
ugadiwshs11111-647x4501.శిశిరమును చూసి అసలు చింతించ వద్దని
  నిశితముగ చూస్తే వసంతము అనుసరిస్తున్నదని
  మోడైన రూపమే నీడనీయ గలదనుటకు
  సాక్ష్యము తానన్నది చిగురిస్తున్న మామిడి. (సహనము)
 …………………..
2.ఎప్పుడంటే అప్పుడు గళము విప్పవద్దని
  గానము చేయాలనుకున్నా మౌనము తప్పవద్దని
  మావి చిగురు తినువరకు మారాడకుండుటకు
  సాక్ష్యము తానన్నది సంగీతముతో కోయిల.(నియమము)
 ……………….
3.ఎద నిండిన అనురాగము ఎల్లలే ఎరుగదని
  పదిమందికి అందించగ పుల్లగా ఎదగాలని
  తనివితీర తినిపించగ తానే తరలుటకు
  సాక్ష్యము తానన్నది చెంతనున్న చింతకాయ.(సంస్కారము)
…………………….
4.ఎగిసిపడు కెరటములో ఎడతెగని ఆరాటముందని
  కమ్మనైన విందులలో క్షార కళిక రూపునొంది
  రుచికై తన అభిరుచినే కనుమరుగు చేసికొనుటకు
  సాక్ష్యము తానంది సాగర లవణము.(త్యాగము)
 ……………………
5.ఫలితము కనపడలేదని,ప్రయత్నమే వదలొద్దని
  అనుకున్నది అయ్యేదాక పనినుండి కదలొద్దని
  గడ రూపములో నున్న మనుగడలో మధురమనుటకు
  సాఖ్యము తానన్నది సారమైన చెరుకుగడ. (పట్టుదల)
6.వాహ్వా అను జిహ్వ నన్ను అసహ్యముగ చూస్తున్నదా
  పువ్వులకై నన్ను జగము ఏడాదికి గుర్తు చేస్తున్నదా 
  అను భావమే అనుభవమై పాఠాలను నేర్పుటకు
  సాక్ష్యము తానన్నది సన్స్కారపు వేప పువ్వు.(అనుభవము)
…………………….…………………..
…………………….…………………….
 అభిరుచుల రుచులను,ఏ వికారములేని కారముతో కలిపి ముచ్చటగ…
   పచ్చడి అని తిందామా లేక పాటించ వచ్చని  అనుకుందామా?
……………………..
  అజ్ఞానపు దారి మార్చి విజ్ఞత వివరిస్తుంది
  దుర్ముఖమును సుముఖముగా-సృష్టంతా మురిసేలా.

Share This Post

2 Comments - Write a Comment

Leave a Reply