అంబేద్కర్ వాదం – భారతీయుల ఆశావాదం – కళ్యాణచక్రవర్తి గొండ్యాల

“అవమానించటం అలవాటైన వాడికి ఆత్మాభిమానం అనే నినాదం ఎన్నటికి అర్థం కాదు “                                                                                                                            –   డా. బి. ఆర్ . అంబేద్కర్

              బహుశా నేటితరం రాజకీయాల లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడటం లేదా ద్వేషించటం లేదా వివాదాస్పదం గా మారిన భారతదేశ తొలి తరం నాయకులలో డా. బి. ఆర్ . అంబేద్కర్ ని మించి ఇంకొకరు లేరు! దేశం మొత్తం మీద డా. బి. ఆర్ . అంబేద్కర్ కు ఉన్నన్ని విగ్రహాలు మరే నాయకుడికి లేవు . అతని 125 వ జయంతి సందర్భం గా అతని లెగసి పై పోటీ పడని  రాజకియ పార్టీ లేదు. దీనంతటికి వెనుక ఉన్న ఆ వ్యక్తియొక్క వ్యక్తిత్వం ఏమిటి ? అతని రాజనీతి సిద్దాంతం ఏమిటి ? దేనికోసం పోరాడాడు ? ఏమి సాధించాడు ? అతని ద్వారా మనం నేర్చుకోవలసినది ఏమిటి ? ఒక్కొక్కటి పరిశీలిద్దాంmygov_1451310963437957

                  వేద కాలం నుంచి ఈ దేశం లో కులం ఒక సామాజిక,  రాజకీయ లక్షణం గా గోచరిస్తుంది. హిందూ మత గ్రంధాలు సహితం (ఉదా : భగవద్గీతలో చాతుర్వర్ణం మయా సృష్టం , గుణ కర్మ విభాగచః అంటాడు కృష్ణుడు. అంటే గుణ కర్మలను బట్టి ఈ చాతుర్వర్ణ వ్యవస్థను నేనే సృష్టించాను అని )ఈ చాతుర్వర్ణ వ్యవస్థను తద్వారా ఏర్పడిన కుల వ్యవస్థను , అందులోనుంచి పుట్టుకొచ్చిన సాంఘీక, ఆర్ధిక , రాజకీయ అసమానతలను వెనకేసుకుంటూ వచ్చాయి. రెండు వేల అయిదు వందల సంవత్సరాల పురాతన నాగరికత కలిగిన ఈ దేశం లో వెనుకబడిన కులాలు , జాతులను ఐక్య పరిచే సాధనం కానీ, వారి గురించి పట్టించుకునే  రాజులు లేదా పాలక వర్గాలు కానీ లేకపోయాయి. క్రీ.పూ.6వ శతాబ్దంలో  గౌతమ బుద్దుడు నెలకొల్పిన బౌద్ద మతం, అంతకు ముందే వచ్చిన జైన మతం వైదిక దురాచారాలను ఖండించటం జరిగింది.  భారత దేశం లో ఇస్లాం, క్రైస్తవం ప్రవేశించటం వల్ల దిగువ శ్రేణి ప్రజలు కొంత మంది తమ మతాన్ని మార్చు కోగలిగారు కానీ సాంఘీక హోదా లో పెద్ద మార్పు రాలేదు . మధ్య యుగాలలో భక్తి ఉద్యమం ( కబీర్, నానక్ లాంటి వారిని భక్తి ఉద్యమ కారులు గా పేర్కొంటారు) దక్షిణ భారతదేశంలో వచ్చిన వీర శైవం కొంత వరకు దిగువ కులాల వారికి ఊరట ఇచ్చిన మాట వాస్తవమే అయినా మార్క్సిస్ట్  సిద్దాంతకర్తల ప్రకారం అటువంటి ఉద్యమాలు  దేశం లో దిగువ తరగతులు తమ భౌతిక జీవితం లోనుంచి విప్లవం తీసుకు రానీయకుండా తటస్థ బాలలు (బఫర్) లా అడ్డుపడ్డాయి.

భారత దేశం లో సామజిక వ్యవస్థపై కులవ్యవస్థ పై హిందూ మత గ్రందాల పట్ల ఆయన తీసుకున్న వైఖరి అంబేద్కర్ ను తనకు ముందున్న, తన సమకాలీన సంఘసంస్కర్తలకు భిన్నంగా నిలబెట్టింది. దేశంలో మతానికి ఉన్న విలువ, సమాజంలో అగ్ర వర్ణాలు మతాన్ని అన్వయిస్తున్న వైనం అంబేద్కర్ చారిత్రాత్మకముగా వివరించటం జరిగింది. “శూద్రులు అంటే ఎవరు ?” , “అస్పృశ్యులు అంటే ఎవరు ?” వంటి రచనలలో అతను  అణగారిన వర్గాల దైన్యస్థితికి చారిత్రక కారణాలను విశ్లేషించాడు. అలా కులవ్యవస్థ గురించి వివరించిన ఆతను కుల నిర్మూలనతోనే ఒక నాగరిక ప్రజాస్వామ్య సమాజం ఏర్పడుతుందని భావించారు.

        శ్రమ విభజన ఆధారంగా కులాలు ఏర్పడ్డాయని కొందరు పరిశోధకులు కులవ్యవస్థను హేతుబద్దీకరించే ప్రయత్నం చేశారు. అయితే అంబేద్కర్ దీన్ని ఖండించారు. అతని ప్రకారం “ ఏ నాగరిక సమాజంలోనూ అసహజమైన పని విభజన ఉండదు. శ్రమకు నిర్దిష్ట నిర్మాణాలుండవు“. ఒక వ్యక్తి శక్తీ సామర్ధ్యాలతో నిమిత్తం లేకుండా కేవలం పుట్టుకతోనే వృత్తులను అంటగట్టడం అశాస్త్రీయమని అతని వాదన.

        దళిత జనోద్దరణ లో అంబేద్కర్ జ్యోతిరావ్ పూలే మార్గాన్ని అనుసరించారు. విద్య ద్వారా అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని పూలే విశ్వసించారు. అంబేద్కర్ యొక్క నినాదం కూడా అదే “అధ్యయనం – సమీకరణం– పోరాటం “.Biography

        నల్ల జాతీయులకు సమాన హక్కులకోసం పోరాడి చరిత్రలో నిలిచిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కు అంబేద్కర్ కు చాలా పోలికలున్నాయి. ఇద్దరూ ప్రజాస్వామ్య వాదులే. హింసాత్మకంగా కాక తమ హక్కుల కోసం చివర వరుకూ మార్టిన్ లూథర్ ప్రజాస్వామ్య పద్దతుల్లో పోరాడారు. అలాగే అంబేద్కర్ కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఉదారవాద ప్రజాస్వామ్య భావనలు పైనే నమ్మకం కలిగి ఉన్నాడు. కానీ హింసాత్మక పద్ధతుల్ని ప్రవచించ లేదు. అంతేకాకుండా మౌలికముగా అంబేద్కర్ రాజ్యాంగ సూత్రాలపట్ల, చట్టాల పట్ల ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి . సాంఘీక అసమానతలు పోవాలంటే చట్టబద్ధం గా రాజ్యాంగ బద్దంగా వ్యక్తికి  రక్షణ ఉన్నపుడే అది సాధ్యమని నమ్మిన వ్యక్తి.

        గాంధీజీ  అస్పృశ్యులను “ హరిజనులు “ అని పిలవటం అంబేద్కర్ కు ఇష్టం లేదు. అంటరాని వారు హరిజనులైతే మిగతావారు దెయ్యం బిడ్డలా ? అని ఒక సందర్భం లో ప్రశ్నిస్తాడు.

జాతీయోద్యమం లో భాగంగా బ్రిటిష్ వారి పరిపాలనలో జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నించిన భారత జాతీయ కాంగ్రెస్ తమ దేశం లో నిమ్న కులాలకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి ఏమి చేసిందని ప్రశ్నిస్తాడు అంబేద్కర్.కనుక దళితులకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు చేయాలని రెండవ రౌండ్ టేబుల్ సమావేశం లో డిమాండ్ చేశాడు. అతని డిమాండ్ కు సానుకూలంగా స్పందించిన బ్రిటిష్ ప్రభుత్వం మెక్ డోనాల్డ్ అవార్డ్ ని ప్రకటిస్తుంది. అయితే ఆ అవార్డ్ కు నిరసనగా గాంధీజీ ఎరవాడ జైలులో సత్యాగ్రహం చేయటం ద్వారా అంబేద్కర్ – గాంధీజీ మధ్య పూణా ఒడంబడిక జరిగింది. దీని ప్రకారం దళితులకు సాదారణ నియోజకవర్గాలలోనే రిజర్వేషన్ ప్రకటించటం జరిగింది. ఈ ఒడంబడికలో భాగంగా దళితులకు నిర్దేశించిన నియోజకవర్గాల సంఖ్య పెంచినప్పటికి అటువంటి నియోజకవర్గాలలో అందరూ ఓటు వేసే హక్కు ఉంటుంది కాబట్టి పేరుకే అక్కడ దళితులు ప్రజాప్రతినిధులైనా వెనుకనుండి నడిపించేదంతా అగ్రవర్ణాలే అవుతారని అంబేద్కర్ భయం. ఆ భయమే నేడు నిజమైంది. పేరుకు దళిత ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు తప్పితే అగ్రవర్ణాల రాజకీయ చదరంగంలో పావులుగా మిగిలిపోతున్నారు.

               రాజ్యాంగ పరిషత్తు లో ముసాయిద కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించి రాజ్యాంగ నిర్మాణానికి హితోదికంగా సేవలందించారు. రాజ్యాంగ నిర్మాణ సభ లో జరిగిన వాదోపవాదాలు రికార్డుల రూపంలో భద్రపరచటం జరిగింది (Constituent Assembly Debates) . వాటిని పరిశీలిస్తే వివిధ దేశాల యొక్క రాజ్యాంగాల పట్ల, మన దేశం లో ఉన్న సామాజిక స్థితి గతుల పట్ల అంబేద్కర్ కు ఉన్న పరిజ్ఞానం అర్ధమవుతుంది.

         అంబేద్కర్ చొరవతోనే శ్రామికుల పని గంటలలో మార్పు తీసుకురావటం జరిగింది (పద్నాలుగు గంటల నుండి ఎనిమిది గంటలు చేసారు ) ఈ రోజు దేశంలో వెనుకబడిన వర్గాల వారికీ ఉద్యోగాలలో ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు అంబేద్కర్ చొరవతోనే సాధ్యపడింది .

        తొలి భారత న్యాయ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ ని రూపొందించారు. అయితే అప్పటి రాష్ట్రపతి డా.బాబూ రాజేంద్రప్రసాద్ ఆ బిల్ పట్ల విముఖత చూపటం తో తన మంత్రి పదవిని తృణప్రాయముగా విడిచిపెట్టారు. హిందూ మతాన్ని సంస్కరించాలంటే కుల వ్యవస్థ ను నిర్మూలించాలని అతను గట్టిగా నమ్మాడు . ఇది ఉన్నత వర్గాలలో ఉన్న స్త్రీల వల్లే సాధ్యపడుతుంది కాబట్టి వారికీ ఆస్తి లో వాటా ఉండాలని అప్పుడే వారు స్వతంత్రులవుతారని హిందూ కోడ్ బిల్ ను రూపొందించారు. తను నమ్మిన సంస్కరణలు సాధ్యపడకపోవటంతో తన అనుయాయులతో బౌద్ధమతమును స్వీకరించాడు.

        ఈ రోజు ఈ దేశం లో కార్మికులకు, స్త్రీలకు, ఉద్యోగులకు ముఖ్యముగా వెనుకబడిన వర్గాలవరందరికీ అంబేద్కర్ వాదం ఒక ఆశా జ్యోతి. కేవలం అతని వారసత్వం కోసం పోటీ పడే రాజకీయ పార్టీలు అతను ఏ వర్గాల కోసం పోరాడారో ఆ వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలి. కేవలం అతని 125 వ జన్మదినం ఘనంగా జరపటం కాదు, అతని ఆలోచనలను అందుకునే ప్రయత్నం చేయాలి.

                                                                                                                                                                                                     -కళ్యాణచక్రవర్తిగొండ్యాల

                                                                                                                                         రాజనీతి శాస్త్ర అధ్యాపకులు

                                                                                                                                     పి.వి.కే.ఎన్. ప్రభుత్వ కళాశాల

                                                                                                                                                 చిత్తూరు

Share This Post

2 Comments - Write a Comment

  1. సాయి వెంకటేష్ కొర్లాం · Edit

    వ్యాసం లో రాజనీతి సంబంధ రచనా విశ్లేషణ చక్కగా సాగింది.
    చక్రవర్తి గారికి అభినందనలు .

    Reply

Leave a Reply