బి.ఎస్.రాములు “బతుకు నేర్పిన పాఠం”… చీకటి పార్శ్వం పై ఓ వెలుగు! -భూక్యా గోపీనాయక్

                             

ఆధునిక తెలుగు కథారచయితలలో తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగివుండి ఒక సామాజిక నిబద్ధతతో తెలంగాణా పల్లె జీవితాన్ని, అణగారిన వర్గాల జీవిత నేపథ్యాన్ని, దళిత ,గిరిజన , బహుజనుల చైతన్యాన్ని వాస్తవిక దృష్టితో తన కథల్లో చిత్రించిన రచయిత బి.ఎస్.రాములు . సంఘటన, పాత్ర , మనస్తత్వ చిత్రణగా పాత కథలు నడిచాయి. వాటితోపాటు సామాజిక చరిత్రను కథగా మలచడం బి.ఎస్.రాములుతోనే ప్రారంభమైంది.13043813_10204582681687432_3198294712057983340_n

                  తెలంగాణా కథకులు మానవజీవితంలోని ఆర్ధిక సంబంధాలను మాత్రమే ఎక్కువగా చిత్రించారు. కానీ బి.ఎస్.రాములు తన కథల్లో అనేక రకాలైన సామాజిక సమస్యలను, మానవ సంబంధాల పరిణామాలను ఇతివృత్తంగా తీసుకుని కథలు రాశారు. తెలుగు కథాసాహిత్యంలో  ఒక శతాబ్ది రాజకీయ , సామాజిక, ఆర్ధిక, తాత్విక అంశాలను చర్చకు తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో ఆయన కథల్లో నుండి “బతుకు నేర్పిన పాఠం “ అనే కథను విశ్లేషించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.    

           “బతుకు నేర్పిన పాఠం” కథ సంభాషణతో మొదలవుతుంది. అడుగుతున్నది ఎవరు?ఎందుకడుగుతున్నారు? నిందితుడు గొర్రెల కాపరి. తానెవరిని చంపాడో అతనికి  తెలియదు. తనకు యావజ్జీవ కారాగార శిక్ష వేయించిందెవరో తెలీదు. అమాయకుడు. గొర్రెంత అమాయకుడు. గొర్రెలకు అతను కాపరి. కానీ ఆయనకు కాపరి ఎవరూ లేనట్టుంది అనే ఉత్కంఠతో పాఠకుడు చదవడం సాగిస్తాడు.కథాంతంలో అడుగుతున్నది ఎవరో తెలుస్తుంది.వారు అఖిల భారత మానవతావాదుల సంఘం వారు. జీవకారుణ్య సంఘం తరుపున సాయం చేసి పునరావాసం కల్పించడానికి వస్తారు.

             ఈకథలో మొత్తం అయిదు సన్నివేశాలున్నాయి. మొదటి చివరి సన్నివేశాలు ఎర్రగొల్ల మల్లయ్యకు , మానవతా వాద సంఘం వారి మధ్య “ఇంటర్యూ” (సంభాషణ) పూర్వకంగా సాగుతుంది. రెండు, మూడు, నాలుగు సన్నివేశాల్లో కేంద్ర పాత్ర మల్లయ్య తన కథ వారికి చెప్తాడు.అనాదిగా గొర్రెలను అడవిలోనే మేపుతున్నారు. ఈ వేళ వద్దంటే ఎక్కడ మేపాలన్నది మల్లయ్య లేవనెత్తిన వెయ్యి డాలర్ల ప్రశ్న. గొర్రె కూర ముద్దే కానీ గొల్లోడు ముద్దు గాడా ? అన్నది అతను సంధించిన మరో ప్రశ్న.

                    “… అసలు ఇవన్నీ నీకు ఎవరో నేర్పుతున్నారు ? “ అన్నది మానవతావాద సంఘం వారి అభియోగం.“ఎవరు నేర్పేదేంది? నా బతుకు నాకు కావాలని అడగడం తప్పా ?” అన్నది అతని చివరి డైలాగు. అది మల్లయ్యకు “బతుకు నేర్పిన పాఠం “ . అందుకే అదే కథ పేరయింది.

                ఈ కథా కాలం 1974. రచనా కాలం 1979. రత్న మాల  సంపాదకత్వంలో వెలువడిన “నూతన” మాస పత్రిక లో 1980 లో ప్రచురింపబడింది (అప్పటికే అది కాకతీయ విశ్వవిద్యాలయం సంచికలో అచ్చయింది). అప్పుడు దాని పేరు “ ఇంటర్వూ” . సవరించిన నూతన ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి 2000 లో మళ్ళీ ప్రచురించబడింది. తర్వాత ‘అడవిలో వెన్నెల’ సంపుటిలో ఇది చోటు చేసుకుంది.

                  “జగిత్యాల కథ “ బి.ఎస్.రాములు గారి తొలి కథ. అయినప్పటికీ “ఇంటర్వూ” యే వారి తొలి ప్రామాణిక కథ. వారు 1990 వరకు విప్లవ సాహిత్య అవగాహనలో భాగంగా కథలు రాశారు. ఇది ‘సృజన’ లో వచ్చిన తొలి కథ . తిరుగుబాటు ఇతివృత్తం. విప్లవ పార్టీ అనాటి వ్యూహం ఎత్తుగడల్లో వర్గ శత్రు నిర్మూలన ఒకటి. దొరలు, ఫారెస్ట్ అధికారులు దోపిడీ దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ గొల్లలు చేసిన తిరుగుబాటు కథావస్తువు. ఈ కథను బి.ఎస్. అచ్చంగా ‘ఇంటర్వ్యూ’ లా రాశారు. అందుకే కాబోలు మొదట వారు కథకు ఆ పేరు పెట్టారు.

               లేఖాశిల్పం, దిన చర్యా  శిల్పం , టేప్ రికార్డర్ శిల్పంలా ఇది ‘ఇంటర్వ్యూ’ శిల్పం. అందుకే శిల్ప రీత్యా దీనికి మొదట పెట్టిన పేరు అన్వర్ధకంగా వుంది. సవరించిన పేరు వస్తు సంబంధం గా వుంది. బడిలో పరీక్షల పాఠాలు నేర్పిన తర్వాత పెడతారు. కానీ బతుకు బడిలో పరీక్షలయ్యాక పాఠాలు నేర్చుకుంటారు, మల్లయ్యలా.

                   తన బతుకు తనకిమ్మని ఎర్రగొల్ల మల్లయ్య మానవతా సంఘం వారిని అడుగుతాడు. కాలాన్ని వెనక్కి తిప్పడం తమ వల్ల కాని పని వారు చేతులెత్తేస్తారు. అందువల్ల అతనికి వాళ్ళ చేతల మీద నమ్మకం కుదరదు. మల్లయ్యది తలతిక్కని… ఎంతో కష్టపడి అతన్ని వెతుక్కుంటూ రావడం తమదే బుద్ధి తక్కువని వాళ్ళు ఆక్రోశించడంతో కథ ముగుస్తుంది. మల్లయ్య ప్రతిస్పందన గురించి రచయిత ఏమీ వ్యాఖ్యానించడు. కథ స్ఫటికమంత స్వచ్చంగా వుండి అర్థమై పోతోంది.ఇక వ్యాఖ్యానం దేనికి?

                     కథలో కథనం చాలా తక్కువ . దాదాపు లేనంత తక్కువ. Feeling Story లా కాకుండా Showing Story లా నడుస్తుంది. కేంద్ర పాత్ర మనస్తత్వాన్ని గురించి రచయిత ఎక్కడా మాట్లాడడు. అది స్వయం ప్రకాశ వికాసాన్ని పొందింది. తనను తాను వ్యక్తీకరించుకుంటూ “బతుకు నేర్పిన పాఠం” తో పాఠకుని కళ్ళు మిరిమిట్లు గొల్పుతూ ఎదిగింది.

                    ఒళ్ళంతా కాలాక ఆకులు పట్టుకొస్తామనే మానవతా సంఘాల్లోని మానవత్వం నేతి బీరకాయలోని నేయిచందం అని తేటతెల్లమవుతోంది. బడుగు జీవితాలకు విప్లవం తప్ప సంస్కరణలు విముక్తిని ప్రసాదించలేవని ఈ కథ అన్యాపదేశంగా సందేశిస్తోంది.

                      బి.ఎస్.రాములు గారివి చాలావరకు నవలంత కథలు . అవి మైక్రోస్కోపిక్ ప్రపంచ దర్శనాన్ని చేయిస్తాయి. కానీ ఈ కథ కేవలం అయిదున్నర పుటలకే పరిమితం. ఏకాంశ కేంద్రీకృత కథనరీతిలోనే ఇది సమాజం లోని చీకటి పార్శ్వం పై సమగ్రంగా వెలుగును ప్రసారం చేయడం విశేషం!

                   16365_front_cover కథలోని తెలంగాణా మాండలిక పాత్రోచిత భాష పాత్రలపై విశ్వసనీయతను పెంచుతోంది. కథలో రచయిత జోక్యం ఎక్కడా కన్పించదు. కథంతా ప్రధమ పురుష లో నడుస్తుంది. రచయిత సర్వ సాక్షీ భూతుడిగా తటస్థంగా ఉండిపోయాడు. పాత్రలు స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీయకుండా కథలోనిది ‘రచయిత కేంద్రక  కథనం (Writer Centred Narration ) కాదు. పాఠక కేంద్రక కథనం ( Reader Centred Narration ) కావడం వల్ల పాఠకుడు Passive Listener గా మిగిలిపోకుండా  Active Participant కథను గురించి ఆలోంచించడం మొదలెడతాడు. కథ బయట , జీవితంలో కథను అర్థం చేసుకోవడానికి ఉపక్రమిస్తాడు.

               మల్లయ్య ఎకరా భూమి తిరిగి అతనికికి రావాలంటే ఏ చేయాలి? అతని పెళ్ళాం ఎందుకు చని పోయింది? దానికి కారకులెవరు? చనిపోయిన ఆమెను తిరిగి తెచ్చివ్వడం సాధ్యం కానప్పుడు ఆమెను చంపే హక్కు ఎవరిచ్చారు? అతని బిడ్డలను ధనికుల బిడ్డల్లా చదువుకునే అవకాశం కల్పించేదెలా? వారికి బతుకు తెరువు కోసం గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇచ్చేదెవరు? దొరల దౌర్జన్యాలకు అంతం ఎప్పుడు? ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ఏం చేస్తావుంది?…ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు … కదిలిన కందిరీగల తుట్టె మాదిరి మనసైపోతుంది పాఠకునికి .రచయిత పాత్ర అయిపోయాక స్పందించే బాధ్యత పాఠకులదే. ఎవరి సంస్కారం కొద్దీ వాళ్ళు స్పందిస్తారు.

              వస్తుశిల్పరీత్యా ఈ కథకు విప్లవ కథా సాహిత్య చరిత్రలో తప్పక తనదైన స్థానం వుంటుంది.

                తెలుగు కథను ఉదాసీనత వెంటాడుతోందని కొంతమంది విమర్శకులు అంటారు. పైపైన కనిపించే జీవితాలను మాత్రమే స్వీకరించినపుడు అందులో మిగిలేది వస్తువు ( content) మాత్రమే. అలా కాకుండా కథలోని పాత్రల మానసిక సంఘర్షణలను, వారి వ్యక్తిత్వాల్లోని చైతన్యాన్ని చిత్రించినపుడు వస్తువుకు శిల్పం పరిపూరకమవుతుంది. పాఠకుడు కథతో మమేకమౌతాడు. బి.ఎస్.రాములు “బతుకు నేర్పిన పాఠం” కథను కూడా ఇలాగే తీర్చిదిద్దారు.

 

bgn photo
భూక్యాగోపీనాయక్,   తెలుగు అధ్యాపకులు, పి.వి.కే.యన్.ప్రభుత్వ   డిగ్రీ &పి..జి.కళాశాల, చిత్తూరు -517002 , సెల్- 9493243034

 

Share This Post

3 Comments - Write a Comment

 1. బ్రహ్మ · Edit

  నాయక్ గారూ..
  బి.ఎస్.రాములు కథల్ని “బతుకు నేర్పిన పాఠం” తో చీకటిని చీల్చి వెలుగును చిమ్మడానికి రచయిత ఎంత పోరాడాలో, విశ్లేషకుడిగా మీరూ అంతే పోరాటం చేశారు.
  మానవత్వానికి చెల్లుబాటుకాని ఆర్థిక సంబంధాల్ని రాములు ఆతని అక్షరాయుధంతో కథల్తోగానీ, నవలల్తోకానీ చిల్లులు వేస్తుంటాడు.ఆ వైనాన్ని మీరు చక్కగా అక్షరబద్దం చేశారు

  Reply
 2. సాయివేంకటేష్ కొర్లాం · Edit

  గోపీనాయక్ గారికి శుభాకాంక్షలు…
  పాఠకులకు మంచి విశ్లేషణాత్మక శైలిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
  సున్నితమైన సామాజికాంశాలలో చీకటి పై సంధింపబడిన శీతమయూఖుని రేఖ ఈ రచన…
  ధన్యవాదాలు…

  Reply
 3. సార్ .. బి ఎస్ రాములు కధ పై మంచి విశ్లేషణ అందించినందుకు కృతజ్ఞలు .. మీ అల్లాబక్షు

  Reply

Leave a Reply