స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు కథా సాహిత్యం -పరిశీలన – బి.గోపిర్యానాయక్

 

 

మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠకుల అభిరుచులు కూడా మారుతూ వుంటాయి.  ఒకప్పుడు బాగా ప్రచారంలో సాహితీ ప్రక్రియలు ఇప్పుడు లేవు.  గతంలో ‘కావ్యేషు నాటకం రమ్యం’ అనేవారు.  ఈ నాటి సాహితీ ప్రక్రియల్ని పరిశీలస్తే వాటిల్లో ఉన్నత స్థానాన్ని పొందిన కథాప్రక్రియను ‘కావ్యేషు కథా రమ్యం’ అని అనక తప్పదు.  పాశ్చాత్య రచయితల ప్రభావంతో వచ్చిన అనేక ప్రక్రియల్లాగే తెలుగులో ‘కథానిక’ కూడా ఒకటి.  అది అంచెలంచెలుగా ఎదిగి ఈయుగాన్ని కథానికాయుగంగా పిలిచే స్థాయికి ఎదిగింది.

 

అగ్నిపురాణంలో ఉన్న స్లోకాన్ని బట్టి కథానిక దీర్ఘంగా సాగిపోకుండా పొందికగా ఉండాలనీ, దీర్ఘ సమాసాలు, వర్ణనలు ఉండకూడదని, పాఠకుడికి సంభ్రమాశ్చర్యాలతో ఊహించని మలుపులతో కథ ముగియాలనే విషయం తెలుస్తోంది.

 

          పరిమిత పాత్రలు, ఆ పాత్రలకు చక్కని పోషణ, ఒకరకమైన ఎత్తుగడ, నడకతీరు, ముగింపు, వస్తు విన్యాస వైశిష్ట్యం, ఒక జీవితసత్యాన్ని ప్రతిపాదించడం, అన్నిటినిమించి వస్వైక్యం వుండి వినోదమో, విజ్ఞానమో, వికాసమో కలిగించగల చిన్న కథ కథానిక.

 

          మౌఖికంగా ‘కథ’ అనే విషయం తెలుగు నాట అనాదిగా ఉంటూ వచ్చింది.  కాని ఒక సాహితీ ప్రక్రియగా తెలుగు కథ రూపు దిద్దుకోవడానికి కొంత సమయం పట్టింది.  ‘‘తెలుగు నవల పందొమ్మిదో శతాబ్దంలోనే రూపుదిద్దుకున్నా తెలుగు కథానిక ఇరవయ్యవ శతాబ్ది దాకా వేచి ఉండవలసి వచ్చింది.  నవల, నాటకం, కావ్యం, పురాణ గాథ వంటి రూపాలలో కథ తెలుగు భాషకు సుపరిచితమే.  బృహత్కథ తెలుగు నేలమీదనే ప్రభవించింది.  కాని కథానిక, చిన్న కథ, కథ అనే ఆధునిక రూపాలలో అది కేవలం ఇరవయ్యవ శతాబ్దిలోనే రూపు దిద్దుకొన్న ప్రక్రియ.  దీని కారణాలు ఏమిటనేది ఆసక్తికరమైన ప్రశ్న’’.

 

          కథ అత్యంత ప్రాచీనమైన ప్రక్రియ.  కథ అనే పదానికి ‘కత’ అనేది వికృతి.  ఎవరైన లేనివి కల్పించి మాట్లాడితే ‘‘కతలు చెప్పకు’’ అని అంటుంటాం.  అంటే కల్పిత వృత్తాంతం కలిగినది కథ అని అర్థం.  విజ్ఞానాత్మకమైన పంచతంత్ర కథలు మొదలు సాహస ఔదార్యాది గుణ వర్ణనాత్మకమైన విక్రమార్క కథలు, అద్భుతమైన భేతాళ కథలు, వినోదాత్మకమైన పేదరాశి పెద్దమ్మ కథలు, హాస్యభరితమైన తెనాలి రామలింగని కథలు పిల్లలను అలరిస్తూ వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించి వారు ఉత్తమగుణ సంపన్నులుగా ఎదగడానికి దోహదం చేస్తున్నాయి.  కథలు పద్యరూపంలో రచింపబడితే వాటి కథాకావ్యాలు అంటారు.

 

          తెలుగు సాహిత్యంలో మహాభారత రచనతో కవిత్రయం వారు కథలను ప్రారంభించారు.  అలాగే భాగవతంలో కూడా అనేక కథలు ఉన్నాయి.  కాని వాటిని కథాకావ్యాలని చెప్పలేము.  ఎందుకంటే అవి ఇతిహాస పురాణాలకు సంబంధించినవి.  చిత్రవిచిత్రలైన మహిమలతో, మలుపులతో, వినోదభరితంగా నీతులతో కూడుకొన్న కథలు గల వాటిని కథాకావ్యాలుగా విమర్శకులు పేర్కొన్నారు.  కథలకే ఎక్కువ ప్రాధాన్యం గలవి కథాకావ్యాలు.  కథాకావ్యాల్లో కథా కథన శిల్పానికి ప్రాముఖ్యం ఉంటుంది.  ఆనాటి సాంఘిక పరిస్థితులను అవి ప్రతిబింబిస్తాయి.  సాధారణంగా చెప్పాలంటే చందమామ కథలు, కాశీమజిలీ కథల వంటి పద్ధతి ఈ కథా కావ్యాల్లో కన్పిస్తుందనవచ్చు.

 

          తెలుగులో కథా కావ్యాలు 12వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు వెలువడ్డాయి.  మొదటి కథా కావ్యం దశకుమార చరిత్ర.  దీనిని తిక్కన శిష్యుడు కేతన 13వ శతాబ్దంలో రచించి తిక్కనకి అంకితమిచ్చాడు.  కేతన కథా కావ్యరచనకు మార్గదర్శకుడు కాగా ప్రస్తుతం వచన రూపంలో వెలువడే కథలన్నిటికీ కథాకావ్యాలే మార్గం వేసినట్లు చెప్పవచ్చు.  లోకరీతిని, లోకనీతిని వివరించే ఈ కథా కావ్యాలు సమకాలీన సాంఘిక చరిత్రకు ఆధార భూతమై తెలుగు సాహిత్యచరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించాయి.

 

          కథ అనే ప్రక్రియ తెలుగులో తొలిసారిగా గురజాడ అప్పారావు రచించిన ‘‘దిద్దుబాటు’’ (1910) కథను పేర్కొంటారు.  బండారు అచ్చమాంబ, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ వంటివారు గురజాడ అప్పారావుకు ముందే తెలుగు కథకు శ్రీకారం చుట్టారు.  అయినా కూడా అన్ని మంచి లక్షణాలు గల మొదటి కథగా ‘‘దిద్దుబాటు’’ ను గౌరవిస్తున్నారు.  తొలి తెలుగు కథ మేరంగా సంస్థానానికి చెందిన ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ (1864 – 1933) రాసిన ‘‘లలిత’’ (1903) అని ఒక అభిప్రాయం ఉంది.  అలాగే డా. భార్గవీరావు సంకలనం చేసిన ‘‘నూరేళ్ళ పంట’’లో బండారు అచ్చమాంబ (1874 – 1904) రాసిన ‘‘స్త్రీ విద్య’’ మొదటి కథగా ముందుకు వచ్చింది.  అలాగే మాడపాటి హనుమంతరావు (1885 – 1970) కథలు ‘‘మల్లికా గుచ్ఛము’’ పేరిట 1915లో ప్రచురితమయ్యాయి.  కానీ సంపూర్ణ కథా లక్షణాలతో గురజాడ అప్పారావు రాసిన ‘‘దిద్దుబాటు’’ కథను మొదటి కథగా చాలామంది అంగీకరిస్తున్నారు.  గురజాడ అప్పారావు రాసినవి ఐదు కథలు, ఒక నవలకి స్కెచ్.  శిల్పరీత్యా సన్నివేశ ప్రథానంగా ‘‘దిద్దుబాటు’’ అనే కథ; మౌఖిక సంప్రదాయ కథన రీతిలో ‘‘మీ పేరేమిటి’’ అనే కథ ఉన్నాయి.  ఇవి రెండూ ఒకే సంవత్సరంలో ప్రచురణకు వచ్చాయి.

 

          గురజాడ అప్పారావు రాసిన ‘‘దిద్దుబాటు’’ కథ చాలా ముందుచూపుతో రాసిన కథ.  ఇంతటి పునాది వేయడం వల్లే తెలుగు కథ ఎన్ని అవాంతరాలనైనా అధిగమించగలుగుతోంది.  అందుకే ఇవాళ కల్పనా సాహిత్య రచయితలు వాస్తవికతతో రచనలు చేస్తున్నారు.

 

          ‘దిద్దుబాటు’ కథలో ప్రధానంగా కనిపించే అంశం వేశ్యా సమస్య, స్త్రీ విద్య.  గోపాలరావు భార్య కమిలిని విద్యావంతురాలు.  పెడదారిన పట్టిన భర్తను తన విద్యాజ్ఞానం వల్ల సరైన దారిలోకి తెచ్చుకుంటిం.  ‘‘మరిలాగా రాతకోతలు మప్పితే ఉడ్డోరం బాబు?’’ అన్న రాముడి ప్రశ్నకు ‘‘ఓరి మూర్ఖుడా! భగవంతుని దృష్టిలో కెల్లా ఉత్తృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీ రత్నమే’’ అన్న గోపాలరావు సమాధానం ‘‘ఆధునిక స్త్రీలు మానవ చరిత్రను తిరిగి రచిస్తా’’ రని గురజాడ వెలిబుచ్చిన ఆశాభావానికి సాహిత్యరూపమే కథ.

 

          జీవితంలోని లోతుల్ని, సంవేదనల్ని, వైరుధ్యాలను, సంక్లిష్టతను దర్శించి వర్ణించడంలో గురజాడ ప్రత్యేకత ఉంది.  వ్యవస్థ, సమాజం, మానవ కల్పిత విశ్వాసాలు, తమకు తెలియకుండానే సంకుచిత జీవన పరిధుల్లోకి, అజ్ఞానంలోకి మనిషిని ఎలా నెట్టివేస్తాయో గురజాడ అర్థం చేసుకోగలిగాడు. కథల ద్వారా ఆయన సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చాయి.  గురజాడ రాసిన ఐదు కథలను బట్టి సమకాలంలోనూ అనంతర కాలంలోని రచయితల కథలను పరిశీలించినపుడు మానవ స్వభావాన్ని గురించి గురజాడకు గల అవగాహన అనితర సాధ్యమైనది.

 

          గురజాడ కథల్లో దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం స్త్రీ సమస్యను ప్రధానంగా చిత్రించిన కథలు.  పెద్ద మసీదు, మీ పేరేమిటి? మత సమస్యను వెలుగులోకి తెచ్చిన కథలు.  దిద్దుబాటులో తన భర్త గోపాల్ రావును ద్వేషించకుండానే సరైన దారిలో పెట్టిన కమలిని, మూఢత్వాన్నే భక్తి అంటున్న వారికి తన ఇంగిత జ్ఞానంతో గుణపాఠం నేర్పిన ‘‘మీ పేరేమిటి?’’ కథలోని నాంచారమ్మ, దాంపత్య జీవితంలో మానసిక వేదనకు గురైన మెటిల్డా, వేశ్యా జీవితాన్ని గడుపుతున్నా ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతున్న ‘‘సంస్కర్త హృదయం’’ లోని సరళ గురజాడ కథల్లోని మహోన్నత వ్యక్తిత్వం గల స్త్రీ పాత్రలు ‘‘దిద్దు బాటు’’ కథలోని గోపాల్ రావు, ‘‘సంస్కర్త హృదయం’’ లోని రంగనాధయ్యార్ పాత్రలు ఆశయానికీ, ఆచరణకూ పొంతనలేని జీవితాలకు ఆదర్శంగా నిలుస్తాయి.  అలాగే గురజాడకు మతంపై స్పష్టమైన దృక్పధం వుంది.  అందుకే ఆనాటి నుండి నేటి వరకు ఈ విషయంపై సపష్టంగా రాసిన రచయిత ఆయనే.  మతం, దాని విశ్వాసాలు సహజ సిద్ధంగా ప్రకృతి స్వభావితమైనవి కావని, అవి మనిషి తన స్వలాభం కోసం సృష్టించుకున్నవని ఆయన అభిప్రాయం.  మానవుడు మూర్ఖత్వం, మౌఢ్యానికి ఎలా బలవుతాడో గురజాడ స్పష్టంగా చెప్తాడు.

 

          గురజాడ అప్పారావు స్ఫూర్తితో అత్యధిక కథలు రాసి తెలుగువాడికి అందచేసిన రచయిత శ్రీ పాదసుబ్రహ్మణ్యశాస్త్రి.  ఆయన వితంతువులను, స్త్రీ విద్యా ఆవశ్యకత నేపథ్యంగా కథలు రాసారు.  స్త్రీలకు విద్యతోపాటు ఆత్మస్ధైర్యం వుండాలని, తనకాళ్ళ మీద తాను నిలబడటానికి విద్య అవసరమని, పురుషుల చేతుల్లో బానిసలు కాకుండా కాపాడుతుందని తెలిపే కథ ‘కీలెరిగిన వాత’.  ఇంకా ‘అరికాళ్ళ కింద మంటలు’, ‘ఇల్లుపట్టిన విధవాడపడచు’, ‘కొత్తచూపు’, ‘అన్నంతపనీ జరిగింది’ కథలు సంస్కార దృష్టితో బాల్యవివాహాల వల్ల జరుగుతున్న అనర్థాలు, వాటికి పరిష్కారాలు సూచిస్తూ కథలు రాయటం జరిగింది.

 

          గుడిపాటి వెంకటాచలం, బందా కనకలింగేశ్వర రావు, వజ్ఘ బాబూరావు, కె.వి.సుబ్బయ్య, జి.వి.కృష్ణారావు లాంటి కథకులు జాతీయోద్యమంతోపాటు ఆనాటి సామాజిక సమస్యలైన వితంతువుల సమస్యలు, బాల్యవివాహాలు తదితర వాటిపై కథలు రాశారు.

 

          చలంగారి ‘సుశీల’ ప్రేమ, మోహాలను త్యజించి దేశంకోసం సహాయ నిరాకరణోద్యమం వైపు మొగుచూపిన ‘యువతి’ గా చక్కటి కథను అందించారు.  ‘‘సులేమాన్! దేశంలోని ఉద్యమం పోతేపోవచ్చు కాని నా హృదయంలోంచి పోదు.  దీనితో నా ఊహలు, నా బతుకు, నా వాంఛలు అన్నీ మారిపోయినాయి.  ఇది వరకటి మనిషిని కాను’’ అనే సుశీల మాటలను బట్టి ఆమెలో ఎంతటి మార్పు వచ్చిందో చలం చిత్రించారు.  అలాగే వితంతువుల సమస్యలపై భిన్నమైన దృష్టిని సారించి ‘శేషమ్మ’, ‘వాణి మిస్టరీ’, ‘వితంతువు’ అనే కథలు రాసారు.  ఆనాటి వితంతు వివాహాలపట్ల అసంతృప్తి ఈ కథల్లో కనిపిస్తాయి.  అందుకే చలం తాను రాసిన కథల్లో ‘వితంతువు’ లకు మళ్లీ ఏమూక్కుమొహం తెలీని వాడికిచ్చి వివాహం చేయటం కన్నా, ‘స్వేచ్ఛ’ ఇవ్వడానికే మొగ్గు చూపాడు.  చలం తన కథల్లో భాష తెలుగు వచనానికి ఓ నూతన పంథాను చూపింది.  కలం నుండి తేనెలూరించే కథలు ఆనాటి సమాజాన్ని ఊపు ఊపాయి.  చలం భాష, శైలి శక్తివంతమైంది.  పాపం, ఓ పువ్వుపూసింది, కన్నీటి కాలువ, ఆత్మార్పణ, ఆరాత్రి, అదృష్టం, కళ్యాణి, నాయుడు పిల్ల, మాదిగమ్మాయి మొదలైన కథల్లో అనేక అంశాలను ఇతివృత్తంగా స్వీకరించారు.

 

          తెలుగు కథానికా పరిణామంలో అన్నట్లు ‘‘చలం గరు కథా శిల్ప ప్రారంభకుడు.  కథకుడిగా మొదటివాడు కాకపోయినా కథా శిల్పిగా మొదటివాడు.  అంతకు ముందున్న కథకులెవ్వరు కథకు బలమైన శిల్పావసరాన్ని గుర్తించలేదు.  సాధారణ చెప్పుకుపోయారు’’.

 

          చలం సాహిత్యం – సామాజిక దృక్పధంలో వివరించినట్లుగా ‘‘చలం కథలు, పాత్రలు, సమస్యలు అభూత కల్పనలు కావు.  నిత్యం సమాజంలో స్త్రీ ఎదుర్కొనే అనేకమైన సమస్యలకు రూప కల్పనలు.  అందం, ధనం, అధికారం ఎరగా చూపి వంచించిన పురుషులు, వ్యవస్థ నెదిరించిన ఒక స్త్రీ చూపు కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన ధీరులు, పై మెరుగులకు అస్ధిరత్వంతో కూడిన ఆలోచనలకు ఆత్మార్పణ చేసి వంచితలైన స్త్రీలు, తన్ను మనసా కోరిన వ్యక్తి కొరకు సర్వస్వం ధారపోసి, మురికిలో, దారిద్ర్యంలో కూడా ఏకాగ్రతతో అతణ్ణి సేవించిన సేవాశీలుడైన స్త్రీలు, సంఘాన్ని, న్యాయాన్ని, వ్యవస్థను ఎదిరించిన ధీరులు, సంఘానికి న్యాయానికి వ్యవస్థకు బలియై తలవంచిన బలహీనులు చలం కథలోని పాత్రలు’’.

 

          గిరిజనులు వారి బాధల నేపథ్యాన్ని ఇతివృత్తాలుగా చింతాదీక్షితులు ‘సుగాలీ కుటుంబం’, ‘చెంచురాణి’ వంటి కరుణ రసాత్మకమైన కథలను రాశారు.  కిష్కింధ లోకోతి, దాసరిపాట, ముద్దు, శంపాలత, మొదటి బహుమానం, గోదావరి నవ్వింది, శ్యామల, శరబాల, లీలా సుందరి, గోపీ మోహిని మొదలైన కథల్లో బాహ్య ప్రకృతిని, బాల్య చేష్టలనూ, ప్రణయంలో బాధల్ని, భక్తిని, విరక్తిని చింతా దీక్షితులు చిత్రించారు.  ‘సుగాలి కుటుంబం’ కథలో కరువుకోరల్లో అల్లల్లాడుతున్న రూపల్ నాయక్ కి తన భార్యతో బాటు ఏడుగురి సంతానానికి పొట్టనింపడం ఎలా అన్నదే జీవన్మరణ సమస్య.  ఈతపొట్టుతో, చింత గింజలతో, బూడిద కలిపిన అంబలితో, ఏమీ దొరకనప్పుడు దేవదారు ఆకులనే ఆహారంగా తీసుకునే ఆ పేద కుటుంబపు దీనస్థితికి, కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి.  చివరకు అన్యాయపు ఆరోపణలతో జైలుపాలవుతాడు గిరిజనుడైన రూపల్ నాయక్.  అతని కుటుంబం చెల్లా చెదరవుతుంది.  జీవితం ఛిద్రమవుతుంది.  ఈ కథ చదివిన పాఠకుడికి ఆవేధన పెల్లుబుకుతుంది.

 

          బహుభాషాకోవిదుడు వేలూరి శిరామశాస్త్రి.  కథాషట్కం, కథా సప్తకం అనే కథా సంపుటాలు వెలువడ్డాయి.  ‘కృతి’ అనే కథలో ఆదిమ మానవయుగాన్ని చిత్రించారు.  ‘పద్మాక్షి’ వైదిక యుగ వాతావరణానికి చెందిన కథ.  బౌద్ధయుగ వాతావరణాన్ని చిత్రించిన కథ ‘తన్మయత’, ‘ఓరినాయనా’ మహమ్మదీయ యుగం నాటి రాజకీయ జీవితానికి అద్దం పట్టిన కథ.  రజాకార్ల ఉద్యమానికి, అరాచక జమీందారీ బిల్లుకు ‘నకల్ హైదరాబాద్’, దేవాదాయ చట్టానికి ‘నమశ్శివాయ’ కథలు దర్పణం పడతాయి.  ఉన్నత విద్యావంతుడైన పెద్దకొడుకు ఉద్యోగం లేకపోవడం వల్ల ఒక మధ్య తరగతి కుటుంబం అనుభవించిన దుర్భర దారిద్ర్యం ‘డిప్రెషన్ చెంబు’ కథలోని కథాంశం.  ఇవే కాకుండా ‘పిత్తల్ కా దర్వాజా’, ‘మాలదాసరి’, ‘పెంపుడు చిలక’, ‘క్షమాపణ’, ‘వ్యత్యయము’, ‘ఒకటే చీర’, ‘సౌందర్యోపాసకుడు’, దత్తు మొదలైన కథల్లో ఆనాటి సమాజాన్ని చిత్రించారు.

 

          విశ్వనాథ సత్యనారాయణ భారతీయ సంస్కృతి, నైతికతలను వెలికితీసే విధంగా కథలను రాసారు.  ‘జీవుడి యిష్టము’ కథలో ఒక నియంత కర్కశత్వాన్ని, ఒక అభాగిని జీవన వీణపై విషాద తంత్రులను మ్రోగిస్తూ చేసిన సాహసాన్ని వర్ణించిన విధం ఎంతో అద్భుతం.  నియంత ఆ అభాగిని భర్త, పిల్లలనూ చంపివేస్తాడు.  ‘‘నీకు తుపాకులున్నవి.  కత్తులున్నవి.  అతనికి ఏమీ లేవు.  అయినా తన భార్యను, పిల్లలను రక్షించుకునేందుకు కర్ర పుచ్చుకొని నిలబడ్డాడు.  రక్షించనని తెలుసు.  అయినా తన ధర్మం తానుచేశాడు.  తాను చచ్చిన తర్వాత గానీ నిన్ను నా దగ్గరకు రానీయలేదు’’ అంటూ నియంత ను ఎదిరిస్తూ ఆమె పలికిన మాటలు ఆశ్చర్యపరుస్తుంది.  ‘నీ రుణం తీర్చుకొన్నా’, ‘ఏమి సంబంధం’, ‘మాక్లీదుర్గంలో కుక్క’, లాంటి కథలు రాశారు విశ్వనాథ.

 

          మల్లాది రామకృష్ణశాస్త్రి కథల్లో ఏ ఇతివృత్తం వున్నా అది శృంగారంతో పెనవేసుకుని వుంటుంది.  సెక్సు సమస్యలతో సతమతమయ్యే యువతరం మల్లాది వారి కథలు చదవటం ద్వారా వారికి ఒక సంజీవనిలాగా ఉపయోగపడుతుంది.

 

          అడవి బాపిరాజు ఎన్నో మంచి కథలురాసి పాఠకుల హృదయాలను దోచుకున్నారు.  ఆయన తెలంగాణా జాతీయోద్యమంతో ముడిపడిన ‘విగళ్ళు’ అన్న కథ రాశారు.  ఆనాటి జాతీయోద్యమం ‘ద్వేషం’ అనే కథలో చిత్రితమైంది.  ఓ పదిమంది బ్రిటీష్ వనితలు బొంబాయి రేవులో దిగి, భారతీయ శిల్ప సంపదను, ఇక్కడి ప్రకృతిని, గాంధీ మహాత్ముడిని చూడాలనుకుంటారు.  వారిలో మేరీటెంపిక్ అనే ఇరవయ్యేళ యువతిని రామప్ప గుడిలో బొమ్మలు గీసే విశ్వేశ్వరుడు చీదరించుకుంటాడు.  కానీ ఆంగ్ల వనితలు మిగిలిన తెల్లవారి కన్నా భిన్నంగా ఉండటం, సంస్కారం, మనసు కలిగిన వారిగా విశ్వేశ్వరుడు భావించి మేరీని అభిమానిస్తారు.  ఇల బాపిరాజు పాత్రలు ఎక్కువగా కళా జగత్తుకు సంబంధించినవి.  ఆయన పాత్రలు కళామూర్తులు, విద్యా పరిపూర్ణులు, ప్రేమమూర్తులు.  జీవితాన్ని కళలకు అంకితం చేసిన కళాతపస్వి బాపిరాజుగారు.

                                        ఇలా స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు కథలో సమాజం లోని అనేక పార్శ్వాలు కనిపిస్త్హాయి.

 

 

 

Share This Post

Leave a Reply