సాహిత్యాన్ని బహుజన బాట పట్టిచ్చిన సామజిక కథోద్యమ నిర్మాణ రూప శిల్పి బి . ఎస్ . రాములు

                                                        -ఎలగొండ రాములు

                (  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన సాహితీ పురస్కారాన్నిప్రముఖ రచయిత శ్రీ బి.ఎస్.రాములు గారికి జూన్ 8, 2016 న ప్రదానం చేయబోతున్న సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నాం. )

“హితం” అంటే ‘మంచి.  ‘ సాహిత్యం అంటే సమాజానికి మంచిని కలుగజేసేది . సాహిత్యానికి ఇంత గొప్ప అర్థం వున్నప్పటికీ, మన తెలుగు సాహిత్యo పరిస్థితి మాత్రం ‘పేరు గొప్ప – ఊరు దిబ్బ’ . అసమానతల సమాజానికి తెలుగు సాహిత్యం తొత్తు కావటమే ఇందుకు కారణం . bs 1వేలాది ఏండ్ల నుంచి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మతపరమైన మైనారిటీ… లాంటి సామాజికుల్ని అణగదొక్కడం సాహిత్యంలో కుట్రపూరితంగా జరిగింది. ఎందుకీ కక్ష? వివక్ష?? వేలాది  యేండ్ల నుంచి యథేచ్చగా కొనసాగుతున్న కుటిలత్వాన్ని చీల్చి చెండాడిన బహుజన రక్తబంధువు మూలవాసి బి.ఎస్ . రాములు గారు . ‘దరకమే ఐక్యవేదిక’ ఆయుధంగా ప్రజాక్షేత్రంలో సామజిక సాహిత్య చైతన్యం కలిగించిన కార్యాచరణశీలి, సామజిక తత్వవేత్త బి.ఎస్. గారు . కథా రచయితగానే కాకుండా కథలబడి, కథకుడి పాఠాలు , కథ తీరు తెన్నెలు, కథన  రీతులు…. లాంటి కథా సాహిత్య అలంకార శాస్త్ర గ్రంథాల్ని రచించడమే కాక కథా వర్క్ షాపుల్ని  నిర్వహించి, మామూలు సాహిత్యాభిమానుల్ని ఎంతోమందిని కథా రచయితలుగా, కథయిత్రులుగా తీర్చిదిద్దిన బహుజన సామాజిక సాహిత్య కథోద్యమ నిర్మాణ రూప శిల్పి బేతి శ్రీరాములు గారు.

‘ గతితర్క తత్వదర్శన భూమిక’, ‘గతితర్క – అంబేద్కరిజం’, ‘మార్క్సిజం’, ‘అంబేద్కరిజం – సోషలిజం’, ‘ప్రేమ అంటే ఏమిటి?’ ‘జ్ఞానం పుట్టుక,’ ‘భౌతికవాద ప్రాపంచిక దృక్పధం’, ‘నేను ఎవరు?’, ‘గతితర్క తత్వదర్శన భూమిక’, ‘భాహుజన తత్వం ( బీసీ, ఎస్సీ, ఎస్టీ సిద్ధాంతాలు- కార్యాచరణ)’, ‘వ్యక్తిత్వ వికాసం – సామజిక నాయకత్వం’, ‘జీవితం అంటే ఏమిటి?’, ‘60 ఎళ్ళ తాత్విక సామజిక పరిమాణాలు’, ‘భారతీయ సమాజం నేటి రాజకీయ సామజిక పరిణామాలు’, ‘యు. పి. లో బి. ఎస్. పి. గెలుపు’, ‘రాజ్యం- ప్రజలు’, ‘సామజిక న్యాయం అంటే ఏమిటి?’, ‘అంతర్జాతీయ పరిణామాలు- దేశీయ మనవ సంబంధాలు’, ‘బీసి లు ఏమి చేయాలి?’, ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధి యువజనులారా!’, ‘బీసి లకు రాజకీయ అధికారం’, ‘భారతీయ చరిత్ర శూద్ర దృక్పదం’, ‘బీసీ లు సాధికారత’, ‘సమగ్ర వ్యక్తిత్వ వికాసం’, ‘లీడర్షిప్- నిర్మాణం, స్వభావం- లక్షణాలు’, ‘తెలంగాణ సామజిక చరిత్ర- సంస్కృతి ఉద్యమాలు’…… వంటి ఎన్నో గొప్ప తాత్విక, సైద్ధాంతిక గ్రంథాల్ని, ‘గబ్బిలం’ పేరుతో మాస పత్రికను ప్రచురించి తెలుగు సాహిత్యం మొత్తాన్ని బహుజన బాట పట్టించిన మహోన్నతుడు, మహామహుడు, బహుజన మేధావి, కథా బంధువు, స్నేహ సింధువు, మూలావాసి, ముద్దుబిడ్డ బి. ఎస్. రాములు గారు. బి. ఎస్. గారి సామజిక సాహిత్య జీవితాన్ని గురించిన వివరణాత్మక ప్రయత్నమే ఈ సాహిత్య వ్యాసం ప్రధానోద్దేశం.

తారీఖు 23 ఆగస్ట్ 1949 రోజున కరీంనగర్ జిల్లా జగిత్యాలలో పుట్టారు సామాజిక తత్వవేత్త మూల వాసి బి. ఎస్. రాములు గారు, తల్లి బేతి లక్ష్మీ రాజు, తండ్రి మిట్టపల్లి నారాయణ. సామాజికంగా వెనుకకు నెట్టెయ్యబదినట్టిది వీరి కుటుంబం. తండ్రి బొంబాయి బట్టల మిల్లు కార్మికుడు. ఆరో ఏట తండ్రి చనిపోగా, తల్లి బీడిలు చేసి సాధిoది. రచయితగా, సామజిక ఉద్యమకారుడిగా, సాహితోద్యమ నిర్మాతగా , తత్వవేత్తగా బహుజన మేధావిగా బి. ఎస్. జీవితం చుట్టూ తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాల భూమిక ఉన్నది.

1967 నుంచి ఎన్నో సామజిక అనుభవాలను పొందుతూ, సామాజిక పునర్నిర్మాణంలో కృషి చేస్తున్నారు. ఆరెస్సెస్ మొదలుకొని అంబేద్కర్ భావజాలం దాక, ఉద్యోగ సంఘాలు మొదలుకొని సాహిత్య సంస్థల దాక చాలా సంస్థల్లో పునర్నిర్మాణ కార్యం సాగిస్తున్నారు.

జీవన గమనంలో సాహిత్య, సామాజిక రంగాలతో పాటు రాజకీయరంగంలో బి. ఎస్. కలిగించిన చైతన్యం మరువలేనిది. ఈ క్రమంలో వీరు జీవితం లో అడుగడుగునా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. వీరి శరీరం తో పాటు మనస్సుకు ఎన్నో గాయలైనై.  భావజాల యుద్ధం లో బి. ఎస్.  ఎదుర్కొన్న విమర్శలు, భౌతిక దాడులు, హెచ్చరికలు, వ్యక్తిగత బెదిరింపులు మొదలగు వాటిని తన ఆచరణ, సిద్ధాంతాల ద్వారా తిప్పి కొట్టడమే కాకుండా, తనను వ్యతిరేకించిన వాళ్ళను కూడా సరైన బాటలో నడిపించిన ధైర్య సాహిత్య సాహసిగా పేరు పొందారు.16365_front_cover

‘బహుజన సాహిత్యo’గా పిలువబడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మతపరమైన మైనారిటీ సామాజికుల సాహిత్యానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి బి. ఎస్. రాములు సాహిత్య కృషి పునాది రాళ్ళుగ పని చేసిందనడoలో  అతిశయోక్తి ఏమాత్రమూలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రoలో ఆంధ్రప్రదేశ్ దళిత రచయితల, కళాకారుల మేధావుల ఐక్యవేదిక (ద.ర.క.మే. ఐక్యవేదిక) తరుపున ‘బహుజన సాహిత్యోద్యమం’ పునాదులు బలపదడంలో బి. ఎస్. కృషి గొప్పగా పని చేసింది. ఇట్టి స్పూర్తిని పొందిన వారిలో ఈ వ్యాస రచయిత కూడా ఉన్నడనేది ఇక్కడ ప్రస్తావించడం అసందర్భం కాదనుకుంటను.

‘ గతి తర్క తత్వ దర్శన భూమిక’ పేరుతో వీరు రచించిన తాత్విక గ్రంధం 1990 లో ఒక పత్రిక సీరియలుగా ప్రచురించగా, 1991 లో పుస్తకoగా ప్రచురితమైనది. భావజాల చర్చ బలంగా సాగుటకు కారణమైన గ్రంథమిది.

1993 లో ప్రచురింపబడ్డ “గతితర్కం – అంబేద్కరిజం – మార్క్సిజం” గ్రంధం లో కులం, వర్గం అనే అంశాలపై చర్చించి, దేశంలో రావలిసిన మార్పులకు తగిన సుచనలను చెయ్యడం జరిగింది.

వెయిల ఏండ్ల నుంచి ఈ దేశంలో కొనసాగుతున్న అనేక అసమానతల్ని అంబేద్కర్ కోణంలో విశ్లేషించి, జరగవలసిన ‘సోషల్ చేంజ్ మూవ్మెంట్’ కు సంబందించిన గ్రంథo “అంబేద్కరిజం- సోషలిజం” 1994 లో అచ్చయింది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ సామజిక వర్గాలో రావలిసిన సామజిక మార్పు కొరకు సిద్దంతాలు- కార్యాచరణను చూపిన గ్రంథo ‘బహుజనతత్వం’ 2004 లో ముద్రించబడింది.

2007 లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రoలో బహుజన సమాజ్ పార్టీ (బి. ఎస్. పి.) సాధించిన ఘన విజయాన్ని బి. ఎస్. రాములు గారు ‘’యు. పి. లో బి. ఎస్. పి. గెలుపు” గ్రంథo లో విశ్లేషించారు. అట్టడుగుకు నెట్టివేయబడ్డ సామజిక జనాలు అసెంబ్లీకి చేరిన తీరును ఎంతో అద్బుతంగా వివరించారు. యే సామాజిక రంగాల్ని ఎట్లా అభివృద్ధి పరచాల్నో, ఇందు కొరకు చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు, సుచనలను చేశారు, ఆలోచనలను అందిచారు. మరెన్నో విషయాలను ఈ పుస్తకములో విశ్లేషించారు.

2008 లో వెలువడ్డ మరొక గ్రంథo “సామజిక న్యాయం అంటే ఏమిటి?”. దేశం లో సామాజిక అసమనలతో కూడిన దుర్మార్గ వ్యవస్థ కలిగించే అవస్థల్ని ఈ గ్రంథo విశ్లేషించింది.

బీసి జనాలలో చైతన్యం కలిగించడం కొరకు బి. ఎస్. రాములు రచించిన గ్రంధాలు- బీసీ లు ఏమి చేయాలి? (2004), బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధి యువజనులారా ! (2004), బీసి లకు రాజకీయాధికారం (2007), భారతీయ చరిత్ర శుద్ర దృక్పధం (2007), బీ సీ లు సాధికారత (2008). దేశ జనాభాలో సగానికంటే ఎక్కువగా బీసీ లు ఉన్నారని రెండు జాతీయ కమిషన్లు- కాకా సాహెబ్ కలేల్కర్ కమిషన్ , బిందేశ్వర ప్రసాద్ మండల్ కమిషన్ చెప్పిన వాస్తవికతకు ప్రతిబింబమే బి. ఎస్. గారు కలిగించిన బిసీ చైతన్యం గా చెప్పవచ్చు.

ChicagoloNanammaమూలవాసి బి. ఎస్. రాములు గారు చేసిన సాహిత్య విశ్లేషణ తెలుగు సాహిత్య లోకాన్ని ఒక కుదుపు కుదిపింది. 1993 లో ‘కన్యాశుల్కాన్ని ఇప్పుడు ఎలా చూడాలి?’ అనే రచన ముద్రించారు. ఒకే అంకె గల చిన్న అంకెల్లోకెల్లా చాలా చిన్న అంకె శాతం కలిగిన బ్రాహ్మణ కుటుంబాల్లో గల సామజిక దురాచారం నిర్మూలించేతందుకు 1893 లో గురజాడచే వెలువడ్డ నాటకం ‘కన్యాశుల్కం’ వందేండ్ల తర్వాత అది ‘వరశుల్కం’ (నేడు దీని పేరు వరకట్నం) గా మారడం, ఎంత గొప్పగా కట్నం ఇస్తే అంత గొప్పగా చెప్పుకోవడం జరుగుతున్నది. అందుకే బి. ఎస్. గారు చేసిన ‘కన్యాశుల్కాన్ని ఇప్పుడెల చూడాలి?’ రచన పై సాహిత్య లోకములో ఎంతో చర్చ జరిగింది.

1993 సంవత్సరాన్ని ఐక్య రాజ్య సమితి ‘ప్రపంచ మూల వాసుల సంవత్సరం’గా ప్రకటించింది. ఇదే సంవత్సరం బి. ఎస్. రాములు గారు ‘దళిత సాహిత్య గర్జన’ అనే రచన వెలువరించారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మతపరమైన మైనారిటీ…. అనబడే 4 రకాల సామాజికులుగా చెప్పబడే ప్రజల్ని దళితులుగా చెప్తూ, వీరికోసం వెలువడే సాహిత్యాన్ని ‘దళిత సాహిత్యం’ గా సిద్ధాంతీకరిస్తూ గర్జించిన సాహిత్య సింహం  మూలవాసి బి. ఎస్. గారు.

1994 లో ‘సాహు ఇంటర్వ్యులు’ గ్రంధం ముద్రితమైంది. తెలుగు నాట తొలి చారిత్రక నవల అయిన ‘కొమురం భీం’ రచించిన ‘సాహు (శనిగరం వెంకటేశ్వర్లు)’ ను బి. ఎస్. రాములు ఇంటర్వ్యు చెయ్యడం తెలుగు సాహిత్యం లో ఒక ప్రధాన ఘట్టం. ‘కొమురం భీం’ నవల రాసేతందుకు సాహు కరీంనగరు జిల్లా నుంచి ఆదిలాబాదు జిల్లాకు వెళ్లి గోండు భాషను నేర్చుకోవడం గొప్ప విషయం. అటువంటి సాహు ను ఇంటర్వ్యు చేసిన బి. ఎస్. సాహిత్య చరిత్రలో ధన్య జీవి.

“సాహిత్య చారిత్రను క్రొత్త చూపులో తిరగ రాయాలి” అనే గ్రంధాన్ని 2004 లో ప్రచురించారు. ‘సాహిత్యంలో జరిగిన పొరపాట్లు, అణిచివేతలు, తప్పిదాలు, తప్పులు….. మొదలగు వాటిని ‘సరిచేసేతందుకు నూతన కోణంలో ప్రయత్నం జరుగాలె’ అనేది మూలవాసి బి. ఎస్. రాములు గారు కోరుతున్నారు. ఉదాహరణకు వాస్తవిక వీరుడైన ఏకలవ్యునికి జరిగిన అన్యాయం, శంభూకిడి హత్య, హిరణ్యకశిపుడి హత్య, శుర్పుణకు జరిగిన అవమానం, తాటకి హత్య, రావణాసురుడి హత్య, వాలి హత్య, మహిషాసురుడి హత్య, సొమకాసురుడి హత్య, బలిచక్రవర్తి హత్య…. మొదలగునవి వీరంతా చేసిన పొరపాటు పనులు ఎమీ లేనప్పటికీ వీరు అన్యాయానికి గురయ్యారు. ఇది సరిదిద్దబడాలనే సాహిత్య ‘చూపు’ బి. ఎస్. గారిది. ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి గా జాతీయ స్థాయి ఉత్తమ క్రీడాకారులకు ఇవ్వబడుతున్న అవార్డు పేరు “అర్జున అవార్డు”. దీని పేరును “ఏకలవ్య అవర్డు” గా మార్చిన నాడే ఈ దేశం లో సామజిక న్యాయం జరుగుతుందనేది బి. ఎస్. గారి ఉద్దేశ్యం.

2011 లో బీసీ కథలు (సామజిక నేపధ్యం- విశ్లేషణ) 2000-2010 కాలానికి సంబంధించినవి. బీసీ లు అన్ని రంగాలలో ఎదగాలనేది ఈ కథల్లోని సారంశం. ఎదుగుతున్న క్రమం లో బీసీ లు బహుజనోద్యమం తో మమేకం కావాలె, ఇలా ఐతేనే రాజ్యాధికారంలో భాగస్వాములవుతారని రచయత బీసీ లకు ఇచ్చే సందేశం.bs 124

కథకు పర్యాయ పదంగా చెప్పుకోదగిన కథకుడు  బి. ఎస్. రాములు కథను శ్వాసగా, ధ్యాసగా జీవితంగా చేసుకున నిత్యసాహిత్యశీలి . 1998 లో కథలబడి  – కథా సాహిత్య అలంకార శాస్త్రము, 2003లో  సమగ్ర కథ 50 ఏళ్ళతెలుగు కథ తీరుతెన్నులు, 2008లో తెలంగాణ కథకులు- కథన రీతులు(2భాగాలుగా), 2008 లో కథా రచన –కథకుడి పాఠాలు, 2008 లో “పాట పుట్టుక – పాటల అలంకర శాస్రం …… లాంటి అలంకార గ్రంధాల్ని రచించి తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. బి. ఎస్. గారు సాహిత్యాన్ని విశ్లేషించెన తీరు, అలంకారాన్ని నిరూపించే కోణం కొత్త తరహాలో వుంటాయి. చెప్పటమే కాదు, చెయ్యటంలో కూడా బి. ఎస్. గారిది ముందడుగే. కథా వర్క్ షాపు ద్వారా ఎంతోమంది కథకులు తయారయ్యే విధంగా బి. ఎస్. గారు చేసిన కృషి ఎన్నటికి మరువలేనిది. యూనివవర్సిటీలు చెయ్యవలిసిన పనిని, ఒంటిచేత్తో, ఒకే ఒక్కడు చెయ్యడం  బి. ఎస్. గారికే సాధ్యమయ్యిoది.

మలిదశ తెలంగాణ ఉద్యమ ఉధృతిలో భాగంగా సుమారు 40 గ్రంథాలను ప్రచురించి, సాహిత్య దివిటిగా (కాగడగా) నిలబడ్డ నిబద్ధత గల రచయిత మూలవాసి బి. ఎస్. రాములు గారు. తెలంగాణ తల్లిని 2007 లో రుపొంధిoచిన బి. ఎస్. గారు ‘జై ఆంధ్ర!’ ఉద్యమానికి మద్దతు పలికారు. ‘ప్రత్యేకాంధ్ర’ కొరకై తాను మద్దతు పలికానని ప్రత్యేకాంధ్ర ఏర్పడడం అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడటమేనని ఆశ్చర్యపరుస్తారు.

86 కు పైగా పుస్తకాల్ని అనేక ప్రక్రియల్లో వెలువరించిన మూలవాసి  బి. ఎస్. రాములు రచనలపై ఎం. ఫిల్ లు, ఒక పి. హెచ్. డి., పరిశోధనలు వివిధ యునివర్సిటీలలో జరిగినై. మరి కొన్ని జరుగుతున్నై. ‘విహారి’ అనే కథా రచయిత ‘నవ్య కథా శిల్పి బి. ఎస్. రాములు’ పుస్తకం ప్రచురించారు.

కథకుడిగా పేరు పొందిన బి. ఎస్. రాములు గారు రెండు నవలలు రచించారు. అవి- ‘బతుకు పోరు’ నవల , ‘చూపు’ నవల. మొదటి నవల 1982 లో, రెండవది 2014 లో అచ్చినై. మొదటి నవల ‘లైఫ్ స్ట్రగుల్’ పేరుతో 2013 లో ఇంగ్లీషులోకి కే. బి. గోపాలం గారిచే తర్జుమా చేయబడ్డది.

కథా రచయిత మూలవాసి  బి. ఎస్. రాములు గారిచే ఇప్పటి వరకు ముద్రించబడిన కథల సంపుటాలు 12. వాటిపేర్లు పాలు (1991), స్మృతి (1997), మమతలు- మనవ సంబంధాలు (2000), వేపచెట్టు (తెలంగాణా కథలు-2003), తేనేటీగలు (2004), పాలు-ఇతర కథలు (2004), బతుకు పయనం (2005), కాలం తెచ్చిన మార్పు (2013), చికాగోలో నానమ్మ (2013), గెలుచుకున్న జీవితం (2013), అడవిలో వెన్నెల (2015), ఇల్లు- వాకిలి (2015).

మూలవాసి  బి. ఎస్. రాములు గారు రచించిన 175 కథల్లో కొన్నింటి పేర్లు- పాలు, స్మృతి, దుస్తులు, తెల్లబట్ట, మెరుగు, దక్షయజ్ఞం, బంది, రియల్ ఎస్టేట్, గాడిద, తల్లి సాలు పిల్లడు , చెలిమి, వరుసలు, వరలక్ష్మి, ప్రేమికులు, తల్లిపాలు, మమతలు, సహజీవనం, ఐదోవాడు, వేపచెట్టు, చేయూత సంబంధాలు, ప్రశాంతం, బతుకు పయనం, ఇంటల్లుడు, కాలం తెచ్చిన మార్పు, రాత్రి పూలు, పెంషనర్ హోంమేకర్, విలువలు, వయస్సు పిలుపు, భీమన్న, చికాగోలో నానమ్మ, మలి యవ్వనం, పాలమూర్ లేబర్ తిరుగుబాటు, నానమ్మ, తులసి, నాగశాల, వారసత్వం, జిజ్ఞాస, సధువు, బతుకు నేర్పిన పాఠం, అసమర్థుని జీవయాత్ర, లక్షమ్మ గెలుపు రహస్యం, మైత్రి వనం, కామన్ వెల్త్, రాజు-రాజగురువు, ఎవరికి వారే, పాత చీర, ప్యారసైట్స్, రాజకీయం, చుట్టరికం, వాళ్ళు గెలుచుకున్న జీవితాలు, విడకులయ్యాక మొదటి భర్త మంచితనం, గెలుచుకున్న జీవితం, మాయ-ప్రేమ, జైలు జీవితం, మార్పు, ప్రేమ, ముగ్గురు మిత్రులు, చరిత్ర హీనులు, వారి యవ్వనం నాకు ఇవ్వు, అమ్మ,….. మొదలగునవి. వివిధ కథా సంకనల్లో వీరి కథలు 50 కి పైగా ప్రచురించబడినయి.

1992 లో రాష్ట్రము లోని 23 జిల్లాల నుంచి కలిసి వచ్చే వారందరినీ కలుపుకొని దళిత రచయితల కళాకారుల మేదవుల ఐక్యవేదిక (ధరకమే ఐక్యవేదిక) నిర్మాణం చేసారు. దళితులు అనగా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మతపరమైన మైనారిటీలు ములవాసి మస్టార్జీ, మూలవాసి డాII కంచ అయిలయ్య, మూలవాసి డాii ననుమాస స్వామి, ములవాసి ఇంగిలాల రామచoద్ర రావు….. మొదలగు వారంతా ‘ధరకమే’ గొడుగు కిందకు చేరారు. “మూలవాసుల కళలు, సాహిత్యం, సంసృతి, చరిత్ర వర్దిల్లలే” అనే నినాదంతో ‘ధరకమే’ పనిచేసింది. దీని స్పూర్తితో ‘డఫోడం’ లాంటి జాతీయ స్థాయి సంస్థలు ఏర్పడ్డాయి. దళిత సాహిత్య సిద్ధాంత భూమిక వేళ్లూనుకొని సాహిత్య సృజన బలంగా ముందుకు రావడానికి క్రియాశీలకంగా కృషి చేసిన మహా రచయిత ములవాసి బి. ఎస్. రాములు ‘ధరకమే’ ఐక్యవేదిక ఏర్పాటు సాహితీ చరిత్రలో గొప్ప మలుపు. ఈ వేదికకు మొట్ట మొదటి రాష్ట్ర అధ్యక్షులుగా మూలవాసి బి. ఎస్. రాములు సాహిత్య సేవలందించారు. వందలాది రచయితలను ఈ వేదిక తీర్చి దిద్దింది. కథ, పాట, వ్యాసం లాంటి సాహిత్య ప్రక్రియల్లో శిక్షణా తరగతులను నిర్వహించారు. వందలాది రచనలు బహుజనులచే వెలువడుటకు ఈ ఐక్యవేదిక దోహదపడింది.

bs 14“ప్రవహించే పాట” పేరుతో సుమారు 1100 పాటలు సేకరించి, తన సంపాదకత్వం లో 1996 లో ప్రచురించారు మూలవాసి  బి. ఎస్. రాములు గారు. 23 జిల్లల నుంచి బహుజనులకు సంబంధించిన పాటలను ఎంతో శ్రమకోర్చి సేకరించారు. ఈ పాటల సంకలనం పై కాకతీయ యునివర్శిటీలో ఎం. ఫిల్. పరిశోధన జరుగుతున్నది.

“సిద్ధార్థ గౌతమ బుద్దుడు ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు, సామజిక సమానత్వ సిద్ధాంత కర్త, ఆచరణ శీలి” అని బి. ఎస్. గారు నిరుపించారు.

రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది కవులు, రచయితలు, కళాకారులూ రచించిన 200లకు పైగా గ్రంథాలకు బి. ఎస్. గారు రాసిన పీఠికలు, స్వతంత్ర వ్యాసాలుగా రూపుదిదుకోవడం అద్బుతం, ఆశ్చర్యం.

తెలుగు సాహిత్యంలో ప్రత్యేక వాదంగా ముందుకోచ్చిన స్త్రీవాదం లో బహుజన  స్త్రీ కోణాన్ని ప్రవేశ పెట్టి స్త్రీవాదుల్ని మెప్పించటం బి. ఎస్. సాహిత్య పటిమకు నిదర్శనం. సామజిక సాహిత్య కృషికి  తార్కాణం.

హేతువాద రంగంలో బి. ఎస్. గారు చేసిన కృషికి తగిన గుర్తింపుగా 1994 లో తెలుగు యూనివర్సిటీ వారి నుండి త్రిపురనేని రామస్వామి స్మారక హేతువాద పురస్కారాన్ని అందుకున్నారు.

మూలవాసి  బి. ఎస్. రాములు గారు రచించి, 2000 సంవత్సరంలో ప్రచురించిన కథల సంపుటి ‘మమతలు- మనవ సంబంధాలు’ కి తెలుగు యూనివర్సిటీ వారి అవార్డు అందుకున్నారు. “పాలు” కథల సంపుటి ఆంద్ర యూనివర్సిటీ & కాకతీయ యూనివర్సిటీ లో ఎం ఏ  పాఠ్యాoశం అయింది. వీరి ‘బతుకు పోరు’ నవల అంబేద్కర్ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ లో పాఠ్యాoశమైనది. వీరి కలం నుండి వెలువడిన వందలాది సామజిక సాహిత్య వ్యాసాలు తెలుగు సమాజాన్ని, సాహిత్యాన్ని సుస్సంపన్నం చేసినై.

ఎన్నో ‘కథా శిక్షణ’ కార్యక్రమాల్ని నిర్వహించిన బి. ఎస్. గారు ‘విశాల సాహిత్య అకాడమి’ స్థాపించి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. 1998 నుంచి 60 కి పైగా సుప్రసిద్ధులతో పాటు వందలాది యువ కథకులకు అందించి, సత్కరించడం …. యువ కథకులను తీర్చి దిద్దడం ద్వారా కథా సాహిత్య వికాసానికి తన వంతు సేవలను అందిస్తున్నారు.

మూలవాసి  బి. ఎస్. రాములు సాహిత్యంపై జరిగిన ఎం. ఫిల్. పరిశోధనలు బి. ఎస్. రాములు “కథలు– ఒక పరిశీలన” – కర్రే సదాశివ్, కాకతీయ యూనివర్సిటీ, “బతుకు పోరు నవల సామజికత”-పల్లా మాలతీ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డ్ మెడల్ పొందిన పరిశోధనిది.JourneyofLife600

‘అడవిలో వెన్నల’ కథకు కొడవగంటి కుటుంబరావు స్మారక పురస్కారం 1984 లో లభించింది. ఇంకా డా. దాశరధి రంగాచార్య పురస్కారం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ పురస్కారం, పాల్కురికి సోమన పురస్కారం ….. మొదలగు పురస్కారాలు అందుకున్నారు. వేలాది సామజిక సాహిత్య సభల్లో పాల్గొని ప్రసంగాలు చేసారు. పలు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఒక సంధర్బంలో డా. కత్తి పద్మారావు అన్నట్లు ‘’బి. ఎస్. రాములు గారొక తాత్విక విశ్వ విద్యాలయం’’. బి. ఎస్. జాతీయ తాత్విక రంగంలో జీవనది లాగా ప్రవహించే తెలుగు తాత్విక చైతన్యం. ఈ తరం మార్గదర్శకులు, వారొక జీవన తత్వనిది.

ఒకే వ్యక్తి రచయిత, తత్వవేత్త రెండూ కావడం ప్రపంచ చరిత్రలో చాలా అరుదు. ఇలాంటి అరుదైన రికార్డు సాధించిన గ్రేట్ మ్యాన్ బి. ఎస్. గారు. వీరి గురించి ఇంకా ఇంకా ఎన్నో పరిశోధనలు జరగవలిసిన అవసరo ఉన్నది. మూలవాసి బి. ఎస్. రాములు గార్కి తెలుగు లేదా కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేటు అందజేయాలని వారు రచించిన ‘అంబేద్కరిజం-సోషలిజం’ పుస్తకం డిగ్రీ స్థాయి విద్యార్ధులకు ఉపవాచకం చేయాలని, అలాగే వారి కథలలో ఏదో ఒకటి పాఠ్యాశంగా పెట్టాలని మేధావులు కోరుతున్నారు. ఇవి త్వరలోనే కార్యరూపం దల్చాలని కోరుకుందాo.

పుస్తకాల రచనల్లో  బి. ఎస్. గారు సెంచరీ కొట్టాలని ఆశిద్దాం.

 

                                                                                                                                                                                                                                                                                                                               -ఎలగొండ రాములు

Cell: 9618598847

 Mail: ramulualagonda@gmail.com

Share This Post

One Comment - Write a Comment

  1. Sugunaprasad Kalvala · Edit

    బాగా వ్రాశారు మీ కు వారికి పోస్ట్ మాకు తెలిపిన వారికి అబినందనలు

    Reply

Leave a Reply