అబ్జర్వేషన్ డోంలో గురజాడ కథలు – పరిశీలన – డా. ఎం. ఎన్. బ్రహ్మానందయ్య

hqdefaultగురజాడ శిల్పాన్నీ గురజాడ సాహిత్య దృక్పథాన్నీ సమగ్రంగా అంచనా కట్టడం కష్టం. లోతైన సంఘాచార సమాచారం ఆధునికంగా దొరకపుచ్చుకోకుండా కాదు కూడదూ పట్టుకోవాలని గొడ్డులా పరిశీలిస్తే అతడు కట్టుబడడు. అతని దృక్పథం అంతుచిక్కదు. కనుకనే, నవ్యసంఘబద్దులకూ సంస్కార బుద్ధులకూ యుగకర్తగా; పాతపడికట్టు కోవిధులయ్యలకూ కూవిధులయ్యలకూ ‘అకవి’గా ‘అరచయిత’గా నేటికీ? కనిపిస్తూంటాడు గురజాడ.

గురజాడ సాక్షాత్తు ఒక్కరే అయినా యథాబుద్ధి తథాదృష్టి తో ఇద్దరిగా కనిపిస్తుంటాడు. పొలం దున్నే రైతు, భక్తి పేరుతో దోపిడీచేసి చలువరాతి కట్టడంలో మసిలేవానికి మట్టిమనిషిగానూ ఆ పక్కగట్టునే ఊరంతా తిరిగి తిరిగీ  పట్టడన్నం దొరికించుకుని చెట్టునీడన ఇంతింత ముద్దలుచేసి తింటున్న అభాగ్యునికి ఆపద్భాందవిడిగానూ కనిపిస్తాడు. కేవలం, వ్యష్ఠి అనుభవాన్ని బట్టీ వొట్టిగా ఎదుటివ్యక్తిని అంచనావేయడం తప్పుకాకపోయినా; పూర్వాపరాల సంఘానుభవాన్ని బట్టి గురజాడ ఆత్మని నిర్ణయించి ప్రకటించడం ఉత్తమం.

              బడుగు జనగణ జీవితాలు జాగృతికి నోచుకోకుండా ఎండుతున్నప్పుడూ తాత్త్విక ప్రతిపాదిక, వ్యక్తుల ప్రతిపాదిక ఎంత బలంగా వీచినా సిద్ధాంత ప్రతిపాదిక లేకుండా ఉద్యమజ్వాల మండదు. ఊపిరినందుకుని ముందుకు నడవదు. ఆ ముందుకు నడిపే మూలగుండె నిప్పుకాగడ గురజాడ. వాదవివాదాలూ వాదోపవాదాలూ ఎన్ని వెంటబడినా వెరవక, వెన్నుచూపక దైవం పేరుతో భక్తి పేరుతో మతాల పేరుతో వర్ణవిభాగాల పేరుతో విభజిస్తున్న కాలాన్నీ మూటగట్టిన మూర్ఖత్వాన్నీ మంటల్లో అద్దాడు. సరికొత్త కలాన్నీ సాహిత్యాగ్నిద్రవంతో సమాన కొలతల వలువల్ని సంఘానికి తొడిగాడు గురజాడ.

అదివరకే, నెత్తికెక్కిన కల్పనా వారసత్వాన్ని మెత్తని అక్షరమాలతో రక్తం కక్కించాడు. భోగానికెగసిపడే భోజ్యకెరటాల జిహ్వల్ని కత్తిరించి సంఘం బాధల్లో భాగం పంచిన ‘సహితస్యహితం’ జాడ గురజాడ. నాటకాలూ కథలూ గేయాలూ కథానికాలూ దేశభక్తి ప్రభోద గీతాలుగా గురజాడ అక్షరాలు సమతాభావ సూత్రాన్ని అల్లాయి. ముఖ్యంగా, కథలు సమాజ రుగ్మతల్ని ఎత్తిచూపాయి. వాటిని అబ్జర్ వేషన్ డోమ్ నుండీ పరిశీలించే ముందు  గురజాడ గురించి ఓ మాట.

పూర్వం, గుంటూరు నుంచీ కృష్ణాజిల్లా అక్కణ్ణుంచీ విజయనగర సంస్థానానికీ గురజాడ వంశ ప్రస్తానం చేసింది. తండ్రి వేంకట రామదాసు. తల్లి కౌసల్యమ్మ. సంఘమాలిన్యాన్నీ దాని మర్యాదల్నీ మందలించడానికి ఏడు నెలలు నిండకముందే సెప్టెంబరు 21, 1862 ఆదివారం నాడు గురజాడ జన్మించారు. ఐదవ సంవత్సానికి అక్షరభ్యాసం మొదలుపెట్టి 1886కు బి.ఏ. పరిక్ష పూర్తీ చేశాడు. ఎక్కువ కాలం సంస్థానాలలోనే గడుపుతూ ప్రపంచజ్ఞానాన్నీ, సాంస్కృతిక వైనాన్నీ నిశితంగా పరిశీలించాడు. గ్రంథాధ్యయనకూ రచనాకాలానికే అధిక సమయాన్ని వెచ్చించడం మూలంగా ఆనారోగ్యం బారినపడి నవంబరు 30, 1915 న చనిపోయాడు. గురజాడ జీవించింది అర్దశతాబ్దమైనా కాలవృక్షం ఆధునికంగా ఎన్ని కొమ్మలు సారినా ఎన్ని పూలూ పండ్లూ పూసి కాసినా యుగకర్తగా సాహితీపరుల్లో నిలిచి ఉంటాడు.

గురజాడకు యుగపురుషుడిగా తాంబూలం అందించిన రచనల్లో నాటకాలు గేయాలతోపాటూ కథలూ ఉన్నాయి. దిద్దుబాటు, మీపేరేమిటి?, మెటిల్డా, సంస్కర్తహృదయం, మతము:విమతము. ఒక్కోకథను ఒక్కో సాంఘిక జాగిలాన్ని తరమడానికి  కుంజరంలా ఉపయోగించాడు గురజాడ.

దిద్దుబాటు

ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో మొదటగా సమాజాన్ని దిద్దుబాటు చేసిన తొలి కథిది. పేదరాశి పెద్దమ్మ, పంచతంత్రం, కాశీమజిలి, తెనాలి రామలింగం, భేతాళ, మదన కామరాజు, శుకసప్తతి కథలు లేకపోలేదు. ఇవన్నీ దిద్దుబాటుకన్నా ముందు వచ్చినవే! వీటిల్లో ఆధునికతా భవిష్యత్తూ వంటి సజీవసత్య సాక్ష్యాలులేవు. సమాజాన్నిచుట్టి ఊహా వ్యామోహంచుట్టూ కల్పనా పరిభ్రమణంచుట్టూ నేలవిడిచి సాము చేసినవే. ఈ కల్పనా సాహిత్య అసమానత్వ జవసత్వాలు ఉడికి సమాధుల్ని చేరాయి దిద్దుబాటు కథతో.

ఆధునికత రీతికి దిద్దుబాటు పాత్రల సంభాషణలు ఉదాహరణలు. కథలోని వస్తువు నాటిదైనా చెప్పే తీరూ ఎత్తుగడా ముగింపూ విషయప్రాధాన్యాలూ, నేటివి. సానులవ్యామోహం ఓ కుటుంబ గౌరవంగా ఉన్నకాలమది. వేశ్యా సంపర్కంలేని ఎటువంటి కార్యమైనా ఘనకార్యం కాదనేది విద్యావంతుల్లోనూ ధనవంతుల్లోనూ ప్రభలిన నేపథ్యాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఆధునిక తెలుగు కథా కర్తృత్వాన్ని మలచిన కథ దిద్దుబాటు. ఈ వ్యామోహంలోపడి ఇల్లాలిని వొదిలి, వెలయాలినీ, ఇల్లునూ వొదిలిరాని భర్త గోపాల్రావుకు బుద్ధిచెప్పి తన సంసారాన్ని దిద్దుకున్న కమలిని దక్షతే దిద్దుబాటు.

దిద్దుబాటు కథలో ఉన్నవి మూడుపాత్రలే. వేశ్యాలోలత్వానికి గోపాల్రావూ ఆధునికతకు అద్దం పట్టే కమలినీ ఆధునిక మార్పును గమనించలేని అమాయకత్వానికి రాముడూ ప్రతినిథులుగా తీసుకుని అభ్యుదయానికీ స్త్రీ అంతర్గత విజయప్రదర్శనకీ శ్రీకారం చుట్టాడు గురజాడ.

కథ ఎత్తుకున్న పదివాక్యాలకే గోపాల్రావు మనస్తత్త్వం బయటపడింది. సానికొంపలో పాటకచేరి ఆసాంతం చూసీ వినీ ఇంటికి చేరి తలుపు తలుపు తెరవమంటూ మొదలెట్టి ఆలస్యానికి చింతిస్తూ ఇక సాని విందుకూ పొందుకూ హాజరుకానని నిర్ణయిస్తూ స్వగతంలో తన్ను తాను తిట్టుకుంటాడిలా గట్టిగా పిలిచితే కమలిని లేవగలదు. మెల్లగా తలుపుతట్టి రాముడిని లేపగల్గితినా చడిలేకుండ పక్కచేరి పెద్దమనిషి వేషము వెయ్యవచ్చును”. ఇక్కడ పెద్దమనిషి వేషానికి రెండురకాల వాచ్యం కలదు. బుద్ధిగా ఉండడమొకటైతే! నటించడమింకోటి! గోపాల్రావుది నటన మాత్రమే లేకపోతే, ఆ పనికి పోయేవాడూ కాదు. ఆలస్యానికి నిర్వచనం ఇచ్చేవాడుకాదు. కనుకనే పెద్దమనిషి స్వరూపాన్ని సింగిల్ వాక్యంలో వాచ్యం చేపించడలా. గురజాడిలా

ఇంకో సందర్భంలో గోపాల్రావు పశువు అవుతాడు. ఇల్లంతా వెతికినా కమలిని కనపడు. రాముణ్ణి పిలిచి వీపున రెండు బలమైన దెబ్బలు వేస్తాడు. ఎవరు చేసిన తప్పును వారే తెలుసుకునీ మారాలనే దృఢమైన నీతిని గోపాల్రావుకు కల్పిస్తాడు గురజాడ. రాముని చేత లేవనెత్తి వీపు నిమిరి పశువువలె నాచరించితినని అంటాడు. మరో సందర్భంలో గోపాల్రావు సంస్కారి. కమలినికి చదువు చెప్పించి, సంసారానికి కావలసిన వనరులు ఏర్పాటు చేశాడు. లోకోద్ధరణపనిలో వేశ్యలభ్రమల్లో పరిభ్రమిస్తూ పదిరోజులైనా ఇంటికి వెళ్ళలేనంత సంస్కారి గోపాల్రావనడంలో మానవ పశులక్షణాల్ని తేల్చేశాడు రచయిత. కమలిని ఉత్తరాన్ని చదివి, పుట్టింటికి వెళ్ళినట్లుగా గుర్తించి రాముణ్ణి గద్దించి  నిలేస్తే వాడు, రెండడుగులు వెనక్కేసి నాను తొంగున్నాను కావాల బాబూ అలకచేస్తే చెప్పచాల్నుగాని బాబూ, ఆడదయి చెప్పకుండా పుట్టింటికి ఎల్తానంటే చెంపవాయించి కూకోబెట్టాలిగాని మొగోరిలాగా రాతలూ కోతలూ మప్పితే ఉడ్డోరం పుట్టదా బాబూ?.” మొగుంతో ఎన్ని బాధలుపడ్డా కట్టుకున్నది ఇల్లుచుట్టుకుని ఉండలా ఉండాలనీ ఆడదానికి రాతకోతలూ నేర్పిస్తే భర్తకు తెలీకుండా భార్య పుట్టింటికెళ్ళేంత విడ్డూరం పుట్టుతుందనీ కరుడుగట్టిన సాంప్రదాయాన్ని రాముడ్తో చెప్పించడం రచయిత నేర్పరితనానికి పరాకాష్ట.

పుట్టింటినుండీ రప్పించడానికి కమలినిపట్ల పశ్చాత్తాపరంగాన్ని ప్రదర్శించాడానికి గోపాల్రావు రాముడికి రిహాసల్స్ వేపిస్తాడు. తగినంతగా డైలాగ్స్ చెప్పిస్తాడు. అయితే, స్త్రీమార్పును ఒంటపట్టనీ చెవిపెట్టనీ రాముడు స్వీయాత్మకంగా చెప్పే డైలాగ్స్ చూడండి అమ్మా! నామాటనుకొండికాలం గడిపినోణ్ణిఆడారు యెజిమాని చెప్పినట్టల్లా యిని వల్లకుండాలి. లేకుంటే మా పెద్దపంతులార్లాగ అయ్యగారు కూడా సానమ్మ నుంచుగుంటారు. మీ శెవులో మాట. పట్టంలోకి బంగార బొమ్మలాంటి సానమ్మ వొచ్చింది. మరి పంతులు మనసు మనసులో లేదు. ఆపైన మీ సిత్తం! అంతానుఅంటాడు. సమాజాంచుల కామబండపై యుగాలనుండి లైంగికదోపిడీకి గురైన స్తానంలోనే స్త్రీని నిలబెట్టే ప్రయత్నం తాలూకూ ఆధిపత్య భావజాలాలకు ప్రతినిథిగా రాముణ్ణి చిత్రించాడు. గోపాల్రావు మందలింపుతో బయటకు పరుగులు పెడ్తాడు. ఇక్కడ రాముడు బయటకు పరిగెత్తడమంటే మార్పును స్వాగతించక అడ్డుపడే అడ్డమైన అడ్డుకట్టలూ అడ్డగోడలూ కూలడమే.

ఈ కథలో ముఖ్యంగా, గోపాల్రావు స్థితి గమనించదగ్గది. భార్య, భర్తపై కోపంతో పుట్టింటికి వెళ్ళింది. ఇక్కడ భర్త, తన తప్పును తెలుసుకుని కమలిన్ని పిలిపించే ప్రాయశ్చిత్తమా! పెళ్ళాం వదిలి వెళ్ళిందని సంఘం, తన్నూ తన వంశాన్నీ వేళాకోలం చేస్తుందనే భయమా! పైదే అందామంటే; అనుకున్నవెంటనే మడిచిపెట్టడానికి దండెంమీది పాతవస్త్రాలు కాదుకదా సానులవ్యవహారాలు! కనుక కథాముగింపు కమలిని చేస్తుంది. అంటే, భర్త ఇష్టపడో కష్టపడో ఓ కట్టుబాటుకు లోబడాలి. సహభాగినికి సమానత్వాన్ని ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో వాటిని భార్య దక్కించుకోవాలి. ముళ్ళును ముళ్ళుతో తీయాలి. వ్యసనాన్ని విచక్షణతో చక్కదిద్దాలి ఆపనే చేసింది కమలిని. ఇక్కడ గోపాల్ మార్పుకు ప్రాధాన్యం లేదు. ప్రాధాన్నించడానికీ గోపాల్రావు మార్పు సహమైందీకాదు. కనుక కమలిని అస్తిత్వం, దాన్ని నిలుపుకునే చాకచక్యం గమనించాలి. స్త్రీపక్షం నుండీ  సంఘాన్ని మార్చడానికి ప్రయత్నించిన గురజాడ వ్యక్తిత్వం గుర్తించాలి.

మీ పేరేమిటి?

దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుల్లారా! మీ పేరేమిటి? ఈ కథకు స్థూలపేరు. ఇది ఏప్రెల్, మే, జూన్ మాసాలు 1910 న ఆంధ్రభారతిలో వెలువడింది. మతం-అస్తిత్వం దైవం-భక్తిత్వం వ్యక్తిత్వంలా  భారతదేశమంతటా వ్యాపించిన ఊడల్నీ, వాటి బలాల్నీ అంతకంటే బలంగా విమర్శకు పెట్టిన కథ మీపేరేమిటి?. మతదౌర్జన్యంలోని లోటుపాట్లూ లోగుట్లూ ఎన్ని గట్లుకట్టుకుని గోపురంపై ఎట్లా? వెలగబెడ్తున్నాయో! ఎందరి వెలుగుల్ని అంధకారంలోకి నెట్టుతున్నాయో! పాఠకులు తమచుట్టూ ఉన్న పరిసరాల్ని ఇప్పటికీ పరిశీలించుకునేటట్లు చేస్తుందీ కథ.

శైవులకీ వైష్ణవులకీ శివుడు గొప్పా? వైష్ణవుడు గొప్పా? నోటితర్కం చిరకాలంగా తగవై నాంతోంది. ఒక వొరలో రెండు కత్తుల్లా! ఒకే ఇంటిలో పిల్లీ ఎలుకల్లా! కల్పనకీ కల్పనకీ పొంతన కుదరని నిజంలా!. వాస్తవానికీ గొడవ దేవుళ్ళ గొప్పతనం కోసం కాదు. వారి బినామీల గొప్ప కోసమే. ఈ విషయం తెలియని పండితుడూలేడు. పామరుడూలేడు. కానీ, బయటకు రారు. కాదు కాదు అవసరం రానీదు. ఈ కథ మొత్తం భగవంతుని అవతారాల చుట్టూ అవసరమైతే కొత్త అవతారం సృష్టి చుట్టూ తిరుగుతుంది.

విద్వాంసుడైన గురువు, వివేకవంతులైన శిష్యుల సంభాషణతో కథ మొదలవుతుంది. శిష్యులు ఆంగ్ల చదువులపట్ల ఆకర్శితులై అవతారాలపట్ల చులకన భావాన్నో శంకనో వేస్తే గురువు ఒప్పుకునేవారుకాదు.వెదవ చదువు మీమతులు పోతున్నాయి మీరు ఒట్టి బౌద్ధులుఅంటాడు. దైవాన్ని శాస్త్రంతోనో ధర్మంతోనో వేదంతోనో ఆలోచించి గుర్తించాలి కానీ బుద్ధితో కాదనేది నాటి పడికట్టు పండితులతర్కం. కానీ, ఇవేవి అప్పటికప్పుడు అందుబాటులో లేనప్పుడు అవసరమే మనిషికి అవతారంపట్ల నమ్మకాన్ని కల్గిస్తుంది. తర్వాత శిష్యులనుంచే బుద్ధచరిత్రను తీసుకుని, చదివి గురువు శలవిచ్చారిలా ఒరే యీ పుస్తకం చదివిందాకా బుద్ధుడిమహిమ నాకు తెలియలేదురా! తప్పకుండా యీ మహానుభావుడు శ్రీ మహావిష్ణు అవతారవేన్రాఅంటూ పదకొండవ అవతారాన్ని సిద్ధాంతం చేయబోతాడు. శత్రువులోనైనా గొప్పతనం ఉంటే మెచ్చుకుంటూ వీలైతే పదకొండవ అవతారం చేసి గుడినో తీర్థాన్నో క్షేత్రాన్నో ఏర్పాటుచేసి, దైవ వ్యాపారానికి కైకర్యం చేసే నాటి మహాభక్తి నిదర్శనాన్ని ఆధునికతగా ప్రదర్శించిందీకథ. ఆనాటినుండీ శాస్త్రుల్లు శిష్యుల్ని బౌద్ధులని ధూషించడం మానేసి, కిరస్తానులని ధూషిస్తాడు. “క్రీస్తును, శ్రీమహావిష్ణు యొక్క పదకొండవ అవతారంగా చెయ్యడానికి సాధ్యంకాక వొడమని వూరుకున్నాం అంటారు శిష్యులు. ఈ వాక్యం పై ఆదర్శానికి దర్పణమైంది. ‘వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పుకాఫీ’ మాట సినిమా అన్నట్టు, ‘వీలైతే కొత్త అవతార సృష్టి కాకపోతే కాలితో తన్నడం’ మినిమం భక్తుడి కర్తవ్యవ్యక్తీకరణ గమనించదగ్గది. లేకుంటే, ఈ దేశం పాండవులుండని గుహలూ సీతమ్మ స్నానమాడని గుంటలూతో స్తానబలిమిని సంపాదించుకునేదేనా! ఒక మతం పేరుతో వెలిసిన అవతారం ఇంకో మతచొక్కా వేసుకోరాదు. అలా ఎవరైనా చేస్తే సహించని శాస్త్రుల్లు బుద్ధుడు విష్ణ్వావతారం కదా యీ జంగాలు శివుడని యేల పూజ చేస్తున్నార్రా” … ? అని నిలదీస్తాడు.

శాయన్నభుక్తుడు చెప్పిన కథలో… శైవుల్లో శరభయ్యా వైష్ణవుల్లో మనవాళ్ళయ్యా అవతారాల ఎత్తుగడ దృష్ట్యా వీరి మధ్య పోటీ. వృషభావతారంగా తన శిష్యులు శరభయ్యను ఆరాదిస్తున్నారు. సాతాన్లు మాత్రం గడాళ్వారి పూర్ణావతారంగానో అర్దావతారంగానో మనవాళ్ళయ్య లెక్కకట్టట్లేదు. ఆ దు:ఖంతో మనవాళ్ళయ్య ఇంతకాలవాయి రాముడి ధ్వజమును జయప్రదంగా మోస్తూ శైవసంహారం చేసిన నేను శ్రీ మద్గరుడాళ్వారి నఖాగ్రాగ్రం యొక్క అవతారం యేల కాను. గారుడాళ్వారి నఖములు పెరిగి, ఖండన ఐనప్పుడూ ముక్కలు నా వంటి భక్తులుగా ఆవిర్భవించి పరమత సంహారం చేస్తవి గాని, వృధాగా పోనేర్చునే? వట్టిమాట!” నాటి సమాజాన్ని ఒకవైపు మూర్ఖత, మరోవైపు అహంకారం ఎట్లా పీడిస్తూ అవతార రూపం దాల్చుతుందీ మాటలతో తేల్చి వేశాడీ రచయిత.

ఈ అవతారాన్ని సృష్టించడంలో ఎంత నేర్పరితనం ఉండాలో దాన్ని నిలబెట్టడం అంత తుంటరితనం చేయాలి. దీనికి ఏ మతావతారం మినహాయింపుకాదు. అలా శివాచార్లు దేశసంచారంచేస్తూ ఆయా ప్రాంతాల్లోని వైష్ణవ మొనగాళ్ళను శైవంలోకి లాగుతుంటారు. అర్దరాత్రి శంఖాలూ జయగంటలూ ఢమాఢిమీల శబ్దంచేస్తూ తొమ్మిది రోజులపాటూ శివార్చనచేసి, పదవరోజున గుండం తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఈ తతంగమంతా వైష్ణవుడు సారధినాయుణ్ణి శైవుణ్ణిగా మార్చే ప్రయత్నం. ఈ విషయం తెలిసిన సాతాన్ల గురువు మనవాళ్ళయ్య అదే గుడి ముందర మీటింగ్ ఏర్పాటు చేసి పరమ భాగవతోత్తములార; వింటిరా శైవుల యొక్క రాక్షసమాయల్లోపడి, అప్పుడే  చాలామంది నాయులు వైకుంఠానికి పోయే రాజమార్గమైన వైష్ణవమతం విడిచి, అంధకారబంధురమైన శైవమతంలో కూలిపోయినారు…. రాత్రి అతడు వెళ్ళి శైవుల ఘోరకృత్యములు చూసెనా, మరి మనవాడుకాదు అంటాడు. ‘మనవాడుకాడు’లో దైవభక్తి రెండు రూపాలుగా చీలి విస్తరించిన వైనాన్ని చెప్పే గురజాడ ధైర్యాన్ని చూడాలి. ఇంతలో రామానుజయ్యలేచి దీనికి అంత ఆలోచనేలా యేమి? వాళ్ళుచేసే పని మనమేల చేయరాదూ రామభక్తుడైన శివుడికే అంతమహిమ వున్నప్పుడు సర్వేశ్వరుడైన రాముడికి అంతకన్న వెయ్యి రెట్లు మహిమ వుండకపోయేనా? గనక నా సలహా యేమిటంటే శ్రీ మద్గరుడాళ్వారి అవతారమైన మనవాళ్ళయ్య రాగి ధ్వజం చేతబట్టుకొని, నాలాయిరం పఠిస్తూ గుండం తొక్కితే సరి. శైవ వైష్ణవ మతాల తారతమ్యం లోకానికి వ్యక్తం కాగలదు.” అంటూ లోకావతార ప్రాణ ప్రతిష్టకు కావలసిన సామాగ్రిని వెలిబుచ్చాడు. ఏదో డొక్కశుద్ధితో అవతార పురుషుడవుదామనుకుంటే ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు మనవాళ్ళయ్య. నీళ్ళు నములుతూ “అన్నలారా! తమ్ముల్లారా! పరమ భాగవతోత్తముల్లారా! మొదలుపెట్టి.. శరభయ్యే వచ్చి తాను వృషభావతారవని నిక్కి నీలుగుతున్నాడుగదా! మనం దెబ్బకి దెబ్బతీద్దాం అని కేవలం వైష్ణవాభిమానం చేత గరుడ వేషం వేశానే గానీ, ఇంత భారవైన శరీరంతో నేను గరుడాళ్వారిని యెన్నడూ కానేరనే? మాట నాకు తెలియదా? ప్రాజ్ఞులైన మీకు తెలియదా!” అంటూ అవతార పురుషుడి పాత్రకు తేలిపోతాడు. చివరికి నాంచారమ్మ ప్రత్యక్షమై పీరుసాయిబూను ఆ పాత్రకు ఎన్నిక చేస్తుంది. సాయిబు విజృంభించి అవతార పురుషుడవుతాడు.

నాడు శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు భగవంతుని అవతారాలలిస్టు భాగవతాన్ని చెప్పి, కొడగట్టుతున్న పరీక్షిత్తు దీపానికి మోక్షసిద్ధి చమురు పోస్తాడాముని. నేడు ‘గురజాడ సంస్కర్త’ మతావతారం పేరిట పగటావతారవేషం కట్టి సంఘాన్ని కొడగట్టుదీపం చేస్తూన్న మతముసుగు కోణాన్ని నిర్వీర్యం చేస్తాడు గురజాడ.

పండితులూ పెద్దమనుషులూ రాగద్వేషాలూ కామక్రోధాలూ వద్దంటూనే; స్వీయాత్మకో స్వీయార్జనకో తలొగ్గి వీటిని పెంచిపోషిస్తూ అవతారపురుషుల రూపాల్ని సృష్టించారు. సంఘాన్ని రెండు ముక్కలుగా వీలైతే వీలైనన్ని ముక్కలుగా చేశారు. వీటన్నింటినీ గుదిగుచ్చి తిరిగి పెద్దముక్కగా ఉర్వివారికెల్ల నొక్క కంచము పెట్టే ప్రయత్నం చేస్తుందీ కథ.

మెటిల్డా

సమాజాన్నిపట్టి పీడిస్తున్న వస్తువుల్లో అసమ వివాహవ్యవస్థొకటి. యవ్వనానికీ ముసలితనానికీ మూడు ముళ్ళుపడి సంఘాన్ని శిథిలం చేస్తూన్న వ్యవస్థలో ఒకానొక అవస్థే మెటిల్డా కథ. మొసలినోటికి చిక్కిన జింకలా, ముసలిభర్తకి చిక్కిన మెటిల్డా నిస్సహాయతనీ దైన్యస్థితినీ వివరిస్తుందీకథ. పురుషుడు, చివరి దశలోనూ  చేతి ఊతకర్రతో నిలబడ్డానికి వృద్ధవివాహవ్యవస్థను ఆశ్రయించాడు. అయితే, వధువుగా వృద్ధురాళ్ళీ వివాహానికి అనర్హులు. బాలికలూ కన్నెలూ అర్హులు. వృద్ధవివాహానికి పట్టాపొంది సంఘంలో నిలబడిన స్త్రీపాత్రలకు ప్రతిబింబంగా గురజాడ మెటిల్డాను దిద్దాడు.

ఈ కథ మొత్తం నాలుగు పాత్రలుచుట్టూ తిరుగుతుంది. అద్దెగదిలో ఉంటూ ఎం.ఏ. వృక్షశాస్త్రం చదువుతున్న కొంతమంది యువకుల పొరుగింటిలో మెటిల్డా ఉంటుంది. ఓ యువకుడు మెటిల్డా అందానికి దాసుడవుతాడు. మిత్రుడైన రామారావు చూడవద్దని షరతుపెడతాడు. వారం రోజులపాటూ మెటిల్డాపై దృష్టిని అణచుకున్నాక, షరతు తప్పడం తప్పిందికాదీ యువకునికి. వీలుదొరినప్పుడల్లా వెసులుబాటు చేసుకుని మరీ పహారాగాస్తూంటాడు మెటిల్డాకై.

రెండు సంవత్సరాలకిందట అద్దెగదిలో దిగిన ముసలిపులి బార్యీ మెటిల్డా. ఇక్కడ మెటిల్డా భర్తకు పులి, ముసలిపులి పేర్లు పెట్టడం రచయితగా గురజాడకున్న సంఘావిష్కారతత్త్వం గమనించదగింది. మెటిల్డా రోజుకు రెండుసార్లు పెరట్లోకి వచ్చే వేళలు, యువకుడు కంపల్సరీ అటెండవ్వాల్సిన రెండు దొంగచూపుల పిరియడ్లు. అతని మనోల్లాసానికి ఎత్తైన పిరమిడ్లు.

ఓ రోజు చీమలా మెటిల్డా నివాసాన్ని కాలినడక ఈదుతున్న యువకుని సమయాన్ని డెగలా కన్నేసి ఒడిసి పట్టుతుంది ముసలిపులి. అబ్బాయీ యిలారా!… నాపెళ్ళాన్ని చూస్తున్నావా!…. నాపెళ్ళాన్ని చూడలేదూ?” ముసలిపులి ప్రశ్నలశర పరంపర. యువకుడు చాశానని సమాధానం. పులి మెటిల్డాపై కోపించి బయటకు పిలుస్తాడిలా.. వస్తావా రావా లంజా!” ఇంటికి వచ్చిన అభ్యాగతునికి తన భార్యను పరిచయం చేసేనాటి సంఘవాక్యాల్ని పులి నోట వాచ్యం చేస్తాడు రచయిత.

 రాజనీతో దండనీతో కాదు. భర్తరూపేనా అంతర్నిగూడ పురుషాధిత్యం ‘స్త్రీ’ని సాంప్రదాయ ఉచ్చుల్లో ధర్మశాస్త్ర ప్రభోదాల కుచ్చుల్లో పాతివ్రత్యాల మన్నికైన మేలి రొచ్చుల్లో స్వేచ్చ, వ్యక్తిత్వం అస్తిత్వ ముండనాల్లో సుమంగళి ముసుగుల్లో కోరికల విధవరాల్ని చేసింది.

తనదారిన వెళ్తున్న యువకుణ్ణి పిలిచి, మెటిల్డా అందచందంపై ముసలిభర్త తర్కశాస్త్రాన్ని ప్రయోగించాడిలా నా పెళ్ళాం అందంగా ఉందా లేదాతోవంట వెళ్ళేటప్పుడు రోజూ దానికోసం యీవేపు చూస్తూ వుంటావా లేదాఅది కంటిక్కనపడితే నీకు అనందం అవునా కాదా! నిజమన్నదేదీ?” అంటే, అవునన్న యువకునితో…అయితే ముండని తీసుకుపో, నీకు దానం చేశాను. తీసుకుపో! నాకు శని విరగడై పోతుంది”.

వాస్తవానికిక్కడ ముసలిపులికి మెటిల్డాపై కోపం ఉన్నట్లు కనిపించినా! నిజానికదికాదు. మెటిల్డాతోనో ఆమె కోరికలతోనో వయసుతోనో పులికి అనుమానం ఉంటే ఉండొచ్చుగాక, కోపం లేదు. వివాహబంధాన్ని అసమానంగా పేర్చిన సంఘాచారంమీద, కాలప్రవాహానికి హారతికర్పూరంలా కరిగి, మిగిలిన తన వయసుమీద, ఏ తప్పూ చేయకపోయినా తన వంశకర్తృత్వంమీద పడే అప్రతిష్టకు బాధ్యత వహించాల్సి వస్తూన్న చుట్టుపక్కల వాతావరణంమీద గానీ, మెటిల్డాపై కాదన్న వాస్తవ చిత్రంలో భర్త పాత్రను తీర్చిదిద్దిన గురజాడ పారదర్శక దార్శనికతం అద్భుతం.

కొంతకాలానికి ముసలిపులి మెటిల్డాపై తనపంథా మార్చుకుంది. ఈ మార్పుకు పక్కింటి యువకుడు కారణమని, కృతజ్ఞతనివ్వడానికి ఇంటికి తీసుకెళ్ళుతుంది ముసలిపులి. మెటిల్డా, కాలింగ్ బెల్తో తలుపుతీసి నిలబడింది. కాఫీ అడిగితే తెచ్చి యిచ్చింది. పులి మెటిల్డాను కూర్చోమంటే సనాతన ధర్మాన్ని పాటించింది. యువకుడు ఇదందా నా వల్లేకదా! సంతోషించేలోగా. పులికాఫీ తాగుతూ తన భార్యకు చదువు చెపుతున్నానన్నీ అమేషా రామాయణం, భారతం చదువుతున్నట్టుందనీ తను ఫలానా చోటికి తీసుకవెళ్ళాలనీ కులాసా చూపించాలని అంతట నా చదువు మాట కొంత అడిగి చివరికి యువకునితో మరినువ్వు వెళ్ళిపో అంటూ ఒకానొక భవిష్య సంధిగ్దావ్యవస్థ రాకుండా ఉండేందుకు పూర్వరంగానుభవం యువకునితో నువ్వెళ్ళిపో అన్న మాట మారని పులిచిత్తాన్ని స్ఫురింపిస్తుంది. అంటే ఓ యువకా! నీవు కోరినట్లు నా భార్యను సమభాగిగా చూసుకుంటున్నాను. ఇక నీ అవసరం నా ఇంటి పరిసరానికి అనవసరం అన్న ధోరణి పులిలో ద్వనించింది. నా పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ మెటిల్డాపాత్ర సంఘాన్ని హెచ్చరించింది.

సంస్కర్త హృదయం

భోగం మేళాలూ నాయుడు మేళాలూ పంతులు మేళాలూ శాస్త్రుల్లు మేళాలూ వివాహ మేళాలూ మరే ఇతర శుభకార్యాలు మేళాల పేరిట సంఘం పెద్దలు స్త్రీలను లైంగికంగా చిక్కుంచుకున్నారు. ఓ వైపునుంచీ స్త్రీలను సానుల్లూ వేశ్యల్లూ వెలయాల్లూ బసవరాళ్ళూ జారిణిళ్ళూ రంకురాళ్ళూ లంజల్లూ వంటి నిజపాత్రల్నిచేసి అసాంఘిక కార్యాలకు వినియోగించుకున్నారు. మరోవైపు మాతృదేవోభవ గా సంభోదిస్తూ కంటినీరు తుడిచే కాల్పనిక పాత్రల్ని వారికంటగట్టారు. “పిర్రగిల్లి శిరస్సు జోకొట్టినట్లు, జల్లకొట్టి జడలో జాజిమల్లె జుట్టినట్లు” ద్వంద్వ నీతి భౌతిక, ఆత్మిక వ్యాపారాన్ని సమపాళ్ళలో కామవాంఛాకొనగోటిమీద నిలిపారు. యుగాలనాటీ ఏకపక్ష సాంఘికాంధకారాచారాన్ని చెదరగొట్టాలంటే ఉదయాన్నిపంచే సంస్కార హృదయం కావాలి. రావాలి. ఆపనికి వచ్చి పనిచేసి ఫలితం తెచ్చిందే సంస్కర్త హృదయం కథ.

ప్రోనాచ్లూ యాంటీనాచ్లూ రాత్రి పగల్లు వాటాలేసుకునీ సాంపాదించుకుంటున్న కాలమది. ఒకవ్యక్తే విభిన్న సమయాల గుర్రాలపై స్వారీచేస్తూ సంతోషపడే సాంఘిక గమనమది. ఆ కాలాన్నీ గమనాన్నీ ఒక కుదుపుకుదిపీ పడుపువృత్తి నిర్మూలించడానికి ఇరవైయ్యోశతాబ్ది ఎలా ముందుకొచ్చిందో ఈ కథ వివరిస్తుంది. ప్రొఫెసరు రంగనాథయ్య దీనికి నడుం బిగించాడు. దానికి కళాశాల గదిని వేదికగా చేసుకుని నీతినియమాల్ని సంఘంలోకి అడుగుపెట్టే విద్యార్థులకు భోదిస్తాడు. సాంఘికంగా పతనమవుతున్న విలువల అక్షరపోగుల్ని దారంమాలగా కట్టుతాడు. విద్యార్థుల మెడలో వేస్తాడు. సంఘంలో పెద్దలైన కరణం, మునసబు, రెడ్లు వారి ప్రోనాచత్వాన్ని పూసగుచ్చినట్లు పత్రికల్లో చిత్రించి తన విద్యార్థులమేధో మెడలో అలంకరిస్తాడు. ఎన్నో ఒత్తిళ్ళకు గురౌతాడు. ఎంతంటే, సానులూ వారికి అండగా నిలబడిన ప్రోనాచ్ వకీళ్ళూ పగపట్టేంత. భోగం పడుచులకు వకీళ్ళంటే వొళ్ళుకోసి ఇచ్చేటంతటి అభిమానం పుట్టుకొచ్చింది. తమకోసం, రెండు పక్షాలుగానైనా చీలిపోయి, ఎంతైనా సాహసం చూపిస్తున్నారు. తమ ప్రియురాళ్ళ మీద వారి కెంతటి దయాభిమానాలో! దీనికి ప్రతిఫలంగా, యథోచితమైన ఆనందాన్ని ప్రోనాచ్ వారికి భోగం పడుచులు అడపా దడపా అందిస్తూనే వున్నారు. కాని సాంప్రదాయ వాదుల పేరు చెపితే, సానిపిల్లల వొళ్ళు గంగవెర్రులెత్తుతోంది”.

కనీసం విద్యార్థులకన్నా సానివృత్తి, పడుపువృత్తి ఎంత హీనమైందో ప్రయోగాత్మకంగా సాధ్యం కానిదే సిద్ధాంతం చేయడానికి సాధ్యంకాదని రంగనాథయ్య సరళను చేరదీస్తాడు. అయితే, ‘చందర్’ విద్యార్థిపాత్ర అడ్డం తిరిగి గురువు తెచ్చిన సరళతో మానవ పరిణామశాస్త్ర పరిశోధనా ప్రయోగాలు చేస్తుంది.

విద్యార్థులని యాంటినాచ్లుగా చేయడం కన్నా, సానులనే సంసారులుగా మార్చే ప్రయత్నం తలపెడ్తాడు ప్రొఫెసరు. కాలం, తనకు కలిసొచ్చి సరళతో పరిచయం కల్గిస్తుంది. ఆమెను పడుపువృత్తి నుంచి దూరం చేయడానికి విశ్వనాథశాస్త్రిని నియమించినా ఫలితం లేకపోవడంతో తానే, రంగంలోకి దూకుతాడు రంగనాథయ్య. ఆ ప్రయత్నంలో ఆఖరికి సరళతో సానికొంపకూ వెళతాడు. నచ్చచెప్పుతాడు. పాపప్పనులు మానమంటాడు. ఈ నరకకూపం నుండి బయట పడమంటాడు. ఎవరినైనా వివాహం చేసుకుని జీవితాన్ని ప్రారంభించమంటాడు. దానికి సరళ నాబోటి భోగం పిల్లలను మర్యాదస్థుడు పెళ్ళాడతాడో చెప్పండి మీరే!”. ఈ ప్రశ్నతో ప్రొఫెసరి పుస్తకభాండాగారం జ్ఞానం భ్రమలొదులుతుంది. భోగం పిల్లాంటే జీవితంలో వోడిపోయి నలిగిన ‘స్త్రీ’ అనే నిర్వచనం తెలుసుకుని పుస్తకవిజ్ఞానం మధ్య కవాతుచేసే వొంటరి సైనికునిలా కాలాన్ని గడిపారే తప్ప సరళ ప్రశ్నకు సమాధాపరచే సత్తాలేక చతికిలపడతాడు. లేస్తాడు. పుంజుకుంటాడు. చివరికి, ఉద్దరించడానికి వచ్చిన రంగనాథయ్య రసరథతత్త్వం సారథ్యంలో మునిగి సరళ పెదవుల్ని చప్పరించే కోరికతో నిజంగా ప్రపంచపు చివరలవరకు నాతో రాగవా సరళా! ప్రొఫెసరు లేచి గబుక్కున ముందుకు వెళ్ళాడు. ఆమె పెదవులను ముద్దుపెట్టుకున్నాడు”.

శ్రీరంగనీతుల్ని చెప్పి రసగంథాన్ని పీల్చే రంగనాథయ్య పాత్రలు మనకు కొత్తేం కాదు. ఇక్కడ గమనించదగ్గ విషయం వొకటి రచయిచ ఆవిష్కరించాడు. ప్రొఫెసరు ఆవేశం తగ్గించుకుని దగాలో పడ్డాననీ మోసపోయాననీ గట్టిగా అరిచినప్పుడు గురజాడ సరళ మనస్సును పట్టుకున్న వైనం యీ కథాకేంద్రాన్ని బలంగా గుర్తిస్తుంది. దగాలో పడ్డాననే మాట విని సరళ సిగ్గుపడిపోయింది. ఆశ్చర్యపడింది. ఆమాయకంగా నవ్వింది. తెల్లబోయి చూసిందిఅంటాడు రచయిత.

సిగ్గు, ఆశ్చార్యాలు కలేసి సరళనూ, ఆమె మనస్సునూ తెల్లబోయేటట్లు చేశాయి. సరళకు ప్రొఫెసరు ఇచ్చిన ముద్దు ఇద్దరికీ తొలి మోజుకు నజరానాగా అందింటే; సహజనితమైన సిగ్గూ ఆశ్చర్యాలూ తెల్లబోటాలూ ఇంతిదిగా ఆమె హృదయాన్ని తాకేవికావు. ఎన్నొట్టు ప్రొఫెసర్లూ మునసబ్లూ కరణాల్లూ రెడ్లూ శాస్త్రూల్లూ పండితుళ్ళూ వంటివారు నిన్ను ఉద్దంరించేస్తామంటూ ముద్దుతో చప్పరించి వెళ్ళిపోయిన శతకోటి రసానుభావభావాలు అదివరకే సరళ సొంతమైనవే. సరళకు ప్రొఫెసరు ఇచ్చిన మూతి ముద్దుకంటే, అతని నోటిలో కరడుకట్టి గూడుకట్టిన మాటలే సరళ ముఖాన్ని తెల్లబోయేట్లు చేశాయి.

మతము: విమతము

వాచ్యం రీత్యా ఈ కథ కొందరికి అంపూర్ణంగా కనిపించినా భావంరీత్యా సంపూర్ణమే. ఇందులో అనుమానం ఆవగింజంతైనాలేదు. ఇది మతానికి సంబంధించిన కథ. మతం పుట్టుక రాజకీయంతో ముడిపడి ఉంటుంది. రాజకీయం వ్యాపార విలువల్ని కల్గి ఉంటుంది. వ్యాపారం బలమైన సాంఘిక, ఆర్థిక గీతను కాంక్షిస్తుంది.

ఒకపార్టి పోయి మరోపార్టి అధికారంలోకి వచ్చినప్పుడు పదైదుమంది ఐ.ఎ.ఎస్.ల బదిలీ అన్నపత్రికా శీర్షికను తలపించినట్లు పూర్వం మతాధికారం సంభవించినప్పుడు పాత పాలకుల మతాలయాల్నీ ధ్వంసం చేయడమో అధికారమతం తాలూకూ మతకట్టడాల్ని నిర్మించడమో చరిత్రకు వింతేమీకాదు. ఇది కట్టడాలతోపోదు. మనుషుల్ని దగ్గరగా తీసుకోవడమో దూరం చేయడమో చేస్తుంది. అలా దగ్గరైన మనిషి నారాయణభట్టు మామల్లో వొకడు. కనుక మతమార్పిడీలు మనుషులకూ కట్టడాలకూ వర్తిస్తాయనే వివేచన పాఠకులకు కల్గిస్తుందీకథ.

అయితే, దీన్ని జీర్ణించలేని కొన్ని సాంఘికమత మనస్తత్వలూ ఎలాంటి మనస్తాపానికి గురౌతారో నారాయణభట్టు పాత్ర ద్వారా చూపిస్తాడు గురజాడ. కాశీనుండి తన సొంతూరుకు పుల్లంభొట్టు శిష్యునితో వస్తాడు నారాయణభట్టు. తన ఊరిలోని శ్రీకాకుళేశ్వరక్షేత్రం కనపడదు. నిశ్చేష్టుడౌతాడు. దానికి ఇంత బాధేలా స్వామి గుడిగోపురమే మీకి కావాలంటే మా వూరికి పోదాం రండి! అన్న శిష్యునితో శివశివ! ఒరే. మీవూరి గోపురం కూడా యీ మ్లేచ్చులు పడగొట్టివుంటాఱ్ఱా!” అంటాడు. మా ఆలయంస్తానే మీ మసీదునెట్లా నిర్మించావు అని నిలదీయడానికి నాడు రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలూ స్వేచ్ఛలూ లేవు. ఉన్న శాస్త్రాలూ ధర్మాలూ అడిగేహక్కు ఇవ్వలేని రోజులని ఈ సందర్భంగా గుర్తుకుతెస్తాడు రచయిత. ఇక్కడ గుడైనా గూడైనా అస్తిత్వ నిర్మాణంగా చూడాలి.

పుల్లంభొట్టు అందుకుని గుడిపగులకొట్టితే దేవుడెందుకూరకున్నాడు, స్వామీఆమాటే యేశాస్త్రంలోనూ కనపడదురా పుల్లా” అన్న నారాయణభట్టు మాటతో శాస్త్రానికీ శస్త్రచికిత్స అవసరమనే తాత్త్వికకోణాన్ని గురజాడ ఆవిష్కరిస్తాడు. ఈ చికిత్సను అన్ని మతసిద్ధాంతాలూ కల్గిఉన్నాయనే నిరూపించే ప్రయత్నం చూడండి. మసీదు దగ్గరకొచ్చి అక్కడ కూర్చున్న వో తురకన్ని నారాయణభట్టు భాయీ! ఇక్కడే కదా! పూర్వం శివాలయం వుంటూ వచ్చింది. అంటే హా సైతాన్కాఘర్ సాయిబూ సమాధానాన్ని రచయిత నిరూపించే సైంద్ధాంతికాంశాన్ని  వొడిసిపట్టుకున్న దృక్పథంలో శాస్త్రీయత కన్పిస్తుంది.

ఈ కథలో పుల్లంభొట్టుకున్న వాస్తవిక జ్ఞానం శాస్త్రీయ దృక్పథం సదాచార కోవిధుడైన నారాయణభట్టుకు లేకపోవడం విచారం. గురువు పాతకాలానికీ శిష్యుడు నవీనకాలానికీ ప్రతిబింబాలుగా చేసి, వచ్చే దార్శనికతా కాలాన్ని ఆనాడే దృష్టాంతంగా చూపించిన గురజాడ “సోషియల్ కమిట్మెంట్” గమనించదగ్గది. ఆచరించదగ్గది.

సమాజాధునికతకూ మానవాభ్యున్నతకూ ఏ ఏ వస్తువులు అంగీకారమో అనంగీకారమో తెలిసిన వైద్యుడు. ప్రతి విషయాన్ని ఎనలైజ్ తో ఫైనలైజ్ చేసే తాత్త్వికుడు. ప్రయోగం, పరిశోధన, రుజువు సాధ్యాలతో మూలాల్ని సిద్ధాంత పరిచే పరిశోధకుడు. త్రిమూర్తీభవించిన ఆధునిక సృష్టి యుగకర్త గురజాడ అప్పారావు.

పంచభూతాలను సాక్ష్యుల్ని చేసి గడిచిన యుగాల మోసాలకు న్యాయం అడిగినట్లు ఐదుకథలు రాశాడు. సంఘదోపిడీవ్యూహరచనల్ని చీల్చడానికి మరింత వ్యూహరచనతో సాగిన ఆధునిక ‘పంచతంత్రకథలు’గా వీటిని తీర్చి దిద్దాడా గురజాడ.

 

                                                          మతం వొద్దు!

                                                       మానవత్వం ముద్దు!

                                                ఇది తెలీనోడు! వొట్టి మొద్దు!

dr.M.N.Brahmanandaiah
డా. ఎం. ఎన్. బ్రహ్మానందయ్య,
ఎం.ఏ., టి.పి.టి., సెట్., నెట్., పిహెచ్.డి, తెలుగు లెక్చరర్, ఆర్.జి.యు.కె.టి-ఇడుపులపాయ, కడప జిల్లా, చరవాణి: 9704034854.

                                           అటువంటి వాడితో స్నేహం కద్దు!!

 

 

 

Share This Post

One Comment - Write a Comment

Leave a Reply