ఏది నిజం ? – జీడిగుంట నరసింహ మూర్తి

సాయంత్రాలు టెర్రస్ పైన కూర్చుని వేడి వేడి కాఫీ సేవిస్తూ ఈ సమాజంలో రకరకాల మనస్తత్వం గల వాళ్ళ గురించి పత్రికలలోని సాహిత్యం గురించి, భ్రష్టు పడుతూన్న రాజకీయాల గురించి  ఇంకా ఇప్పుడొస్తున్న సినిమాల గురించి సుదీర్ఘంగా రచయిత  శ్రీకాంత్ , నేను ముచ్చటించుకోవడం దాదాపు రోజూ జరిగేదే. అప్పుడప్పుడు మా సంభాషణలలో మా ఆవిడా కూడా తల దూర్చేది . మా మధ్య అనేకానేక విషయాలు చర్చకు వొస్తూ ఉంటాయి.

ఆ రోజు శ్రీకాంత్  కుటుంబ జీవనం గురించి చెపుతున్నాడు  . .ఏదో ఒక కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అతనెప్పుడూ ఒక నిర్ణయానికి రాడని చెప్తూ ఉంటాడు.    కుటుంబ జీవనం బాగా విస్తరించిందనీ  , పురుషుడైనా, స్త్రే అయినా సమాజంలో గౌరవాన్ని పెంచే  వివాహం కోసం ఆరాట పడుతున్నారని . పెళ్లి కాని వారితో పోల్చుకుంటే పెళ్లి అయిన వారికి ఉండే సామాజిక, ఆర్ధిక భద్రత ఎప్పుడూ పకడ్బందీగానే ఉంటుందనీ అతని  ఉద్దేశ్యం…   .

484d2669f32db292c23b510dcc1d4bf4“ మానవ సంబంధాలు రోజు రోజుకు కుంచించుకు పోతున్న ఈ రోజుల్లో , వ్యక్తిగత కుటుంబ స్వార్ధానికే విలువలు పెరిగాయని ఇతరుల కోసం ,త్యాగాలు చెయ్యటానికి ఎవ్వరూ సిద్దంగా లేరని ,ప్రతి వ్యక్తికీ తన కుటుంబమే ముఖ్యమనీ హత్యలు చేసేవాడి కైనా అడుక్కుని తిని  బ్రతికే వాడికైనా  పెళ్ళాం పిల్లల్ని పోషించక తప్పదనీ   ఎక్కడో కొన్ని కుటుంబాలు మూర్ఖత్వంతో  నాశనమైపోయినా  చాలా కుటుంబాలలో వారు మాత్రం తమ భార్య ,పిల్లలతోనే   ప్రేమానురాగాలు పంచుకుంటున్నారని” గట్టిగా హత్తుకునేటట్లు చెప్పాడు…  .

కొంతమంది ప్రవర్తన విచిత్రంగా ఉన్నా అది నిజ జీవితానికి దూరంగా అనిపించినా ఇటువంటి వాళ్ళు కూడా వున్నారని చెపుతూ తను దగ్గరగా పరిశీలించి తన మస్తిష్కంలో భద్రపరచిన  జ్ఞాపకాల వెల్లువ నుండి  ఒక్కొక్కటిగా   చెప్పడం మొదలు పెట్టాడు.  

xxxx                                    xxxx                                          xxxx

“మధూ!  రోజులు  గడుస్తున్న కొద్దీ నీ అందం మరింత పెరగడమే కాకుండా మంచులోని మల్లి మొగ్గలా వికసిస్తోంది. నుదుట పూర్ణ బింబంలాంటి  బొట్టు,  ముఖంలో ఏ కల్మషం లేని అమాయకత్వం నన్ను కట్టి పడేస్తున్నాయి. పెళ్ళయ్యాక ముగ్ధ మనోహరంగా నా వెనుక నువ్వు నడిచి వచ్చిన తీరు , తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు ఆ నమ్రత, చిరునవ్వుతో కూడిన మందహాసం, జీవితాంతం ఒకరి నొకరిని విడదీయరాని బంధంగా, ఆ బంధం సజీవంగా ఉండిపోతుందనే  భరోసా నా నరనరాల్లో చేరి నన్ను నేను నీ దాసుడ్నిగా ప్రకటించుకున్నాను. అదే ప్రేమ , అదే

                                                            -2-

అనురాగం, అదే నవ్వు ఈనాటికి  నీలో చెక్కు చెదర లేదు. నిజంగా నువ్వు నా అదృష్ట దేవతవి.  నీతో ముడి పడ్డాక నా జీవన గమనం పూర్తిగా మారిపోయింది. “  అంటున్నాడు మోహన్ మంద్ర స్వరంతో ఆమెను అల్లుకుపోతూ.

 అతని మాటలు ఆమెను  గిలిగింతలు పెట్టాయి. అతని స్వరంలోని మాడ్యులేషణ్ విచిత్రంగా అనిపించింది. అతని ముఖంలోని ప్రశాంతత ఏ విధమైన కృత్రిమత్వాన్ని  కనపడనీయడం  లేదు.  

“ కాదండి . ఈ అదృష్టమంతా నాది.  , ఏ విషయానికి తొందరపాటు లేని తనం , అతిశయం గాని, అహంభావం గాని దరి రానీయని మీ లాంటి ఉత్తమ వ్యక్తి నాకు భర్తగా దొరకటం నా అదృష్టం కాదంటారా?” అంటోంది మాధవి  తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటూ.

xxxx              xxxx                              xxxx                                        xxxx

వేణిలో పెళ్లయ్యినప్పటినుండి విపరీతమైన  మార్పు వచ్చింది. ఆమెకు ఆమె బంధు వర్గంలో ఎవ్వరిని కలవాలని పించదు. పెళ్ళిళ్ళు, శుభ కార్యాలకు దూరంగా ఉంటుంది.  అంతే కాదు ఆమె తన భర్తను కూడా ఎక్కడికీ వెళ్ళనీయకుండా  తనతోనే గడపాలని కోరుకునేది .  ఆమెకు  అతనే ప్రపంచం .అతని తోడు కావాలి . ఎన్నో సందర్బాలలో వారిద్దరూ కలిసి ఒంటరిగా కూర్చుని చాలా విషయాలు చర్చించుకునే వాళ్ళు. వారిద్దరి మధ్య వారి పిల్లల్ని తప్ప మరే  ఇతర  జీవిని భరించే వారు కాదు. ఆమె అడుగడుగునా అతన్నే నీడలా అనుసరిస్తుంది .ఆమెకు అతను తప్ప అతని బంధువులంతా    స్వార్ధపరులుగా అనిపిస్తూ వుంటారు  అటువంటి వాళ్ళతో నవ్వుతూ నటిస్తూ కలిసి మెలిసి  మెలగలేనంటుంది.    చాలా  కుటుంబాల లోలాగానే  తనకు తెలియకుండా తన భర్త తన వాళ్ళకు  ఎక్కడ హామీలు ఇచ్చి డబ్బు దోచి పెడుతున్నాడో నన్న  అనుమానం, వాళ్లకు ఎక్కడ దగ్గరవుతున్నాడో నన్న ఒక రకపు అసూయ   ఆమెను తిండి తిననీయదు. నిద్ర పోనీయదు. ఈ రకపు మనస్తత్వం తో ఆమె ఎంతోమందిని దూరం చేసుకోవటమే కాకుండా బంధువర్గంలో సానుభూతిని పూర్తిగా కోల్పోయింది.

“ నా భార్యలో నాకే లోపం కనిపించలేదు.  ఆవిడ నా కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. కళ్ళల్లో వత్తులేసుకుని రాత్రంతా నిద్ర త్యాగం చేసి నా పిల్లలిని చదివించి వాళ్ళు ఉన్నత స్తితికి ఎదగటానికి దోహద పడింది.  ఆమె ప్రోత్యాహం  వల్ల నా ఉద్యోగంలో ఎంతో  ఎత్తుకు ఎదిగాను. ఆర్ధికంగాఅందరూ అసూయ పడేటట్టుగా  బలపడ్డాను.  ఆవిడ వల్ల నా సంసారం నాశనం  కాలేదే ? ఆవిడ వల్ల ఎవరికో అసంతృప్తి ఉంటే నేనేంచెయ్యను? నేనయితే ఆవిడకు వందకు వంద మార్కులు వేస్తాను.  ఎవ్వరి కామెంట్స్ నేను వినను పట్టించుకోను “ ఇది కృష్ణవేణి  భర్త స్టేట్మెంట్.

                                                    -3-  

“ఇన్నాళ్ళ నా జీవన  యాత్రలో  నా బార్య నాకు చేసిన సేవ అపూర్వం. నేను ఉద్యోగ రీత్యా ఆమెకు దూరంగా ఉన్నా   పిల్లల ఆలనా పాలనా మొదలుకుని ఆర్ధిక వ్యవహారాలూ చక్కపెట్టటం వరకు ఆమె చేస్తున్న కృషి అనిర్వచనీయం.. .  నా ఉద్దేశ్యంలో కుటుంబంలో భర్త పాత్ర చాల తక్కువగా , భార్యే ప్రధాన పాత్రధారి సూత్రధారి అని  నమ్ముతాను. . ఆవిడ లేకపోతే జీవితమే లేదు.”  ఇలా బహిరంగంగా భార్య గురించి  కొన్ని వందలసార్లు చెప్పి ఉంటాడు ఆనంద్ అనే ఇంకొకతను..,

 వెంకట్ భార్యను చీటికి మాటికి అవమానిస్తూంటాడు. ఒక్కకసారి చెయ్యికూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.. కోపంవచ్చి నప్పుడు పిల్లల్ని  కూడా చితక బాదు తూంటాడు.  అయితే  అతనిలో కొన్ని సుగుణాలు కనిపిస్తాయి.. అతను ఆఫీసుకు తప్ప భార్య లేకుండా ఎప్పుడూ  ఎక్కడికీ వెళ్ళడు.  పొరపాటున కూడా భార్యను ఇతరుల దగ్గర అవమానించడు. బయట భార్యను గురించి గొప్పగా చెప్పుకుంటాడు . ఇంట్లో అతని ప్రవర్తన ఆమెను భాదిస్తున్నా బయట నలుగురిమధ్య బాగా చూసుకుంటున్నాడనే  తృప్తి ఆమెలో వుండి అతనితో పూర్తిగా అడ్జస్ట్ అయిపోయింది.  

వీళ్ళు  కాకుండా మోహనరావుకు  ఇంకో కుటుంబం తారసపడిందిట  . . అరవై ఏళ్ళు దాటిన  వయసులో కూడా అతను పెళ్ళాంతో కలిసి ఈకాలం సినిమాలకు వెళ్తూ ఉంటాడు. ఆమె పెద్ద అందగత్తె కాకపోయినా ఆమె అతను ప్రక్కనుంటే చాలు  రంభతో ఉన్నట్టుగా ఫీలవుతుంటాడు. ఆమెవల్ల అతనికెంతో కలిసి వచ్చిందని దగ్గరి  వాళ్ళతో  చెప్తూవుంటాడు. ప్రతి ఏడాది  క్రమం తప్పకుండా ఇద్దరి పుట్టిన రోజులూ ఘనంగా చేసుకుంటారు . వీలైనప్పుడల్లా ఆవిడ మెడలో నగలు దిగేయటం , అల్మరాలన్నీ ఆవిడ కోసం బట్టలతో నింపేయటం , ఆమె ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆరా తీయక పోవడం  అతనికి మామూలు విషయాలు .

“ఈ సమాజంలో చాలా మంది ‘తాము భర్తలతో చాలా భాధలు పడుతున్నాం’ అని నలుగురి మధ్య వాపోతూ వుంటారు. కానీ వారు తాము అనుభవించిన సుఖాలు గురించి మాటలాడరు. . . మితిమీరిన స్వార్థం కానీయండి  ఇంకేమైనా కానీయండి ఎవరి కుటుంబాలను వాళ్లు చక్కగా చూసుకుంటున్నారు “ ఇది  శ్రీకాంత్   తన సర్వేలో తెలుసుకున్న పచ్చి  నిజాలు.  

అయితే పైకి ప్రేమగా  ఉన్నట్టు నటిస్తూ పరోక్షంగా జీవితంలో నిప్పులు పోసుకుంటూ అవతల వాళ్ళకు దొరికిపోయే  వాళ్ళూ వున్నారు. తిరిగి ఏకమై కడదాకా కలిసి జీవించే వారూ ఉన్నారు అని చెపుతూ శ్రీకాంత్ ఆరంభంలో ప్రస్తావన తీసుకొచ్చిన మాధవీ మోహన్ల ప్రసక్తి మళ్ళీ తెచ్చాడు..

                                                      -4-

“ఏమిటోయ్ అలా దేభ్యం మొహం పెట్టుకుని కూర్చున్నావ్ జేస్టాదేవేమేనా పూనిందా ఏమిటీ ? కొద్దిగా మంచి చీర కట్టుకుని ఒబ్బిడిగా తగలడొచ్చుగా ! ఈ రోజు మా ఫ్రెండ్ భోజనానికి వస్తున్నాడని గుర్తుండి ఏడ్చిందా లేదా?” విరుచుకు పడుతున్నాడు మోహన్.

“ ఆ సర్లెండి నా మొహానికి మంచి చీర కూడాను. ఏదో శాస్త్రం చెప్పినట్టు ఒక మూర పూలు తేలేని వాడు చీరలెలా తేగలడు? అయినా నా కిప్పుడు పెళ్లి చూపులు ఏమీ జరగటం లేదుగా?”

“ ఆ అదొక్కటే తక్కువయ్యింది నీ మొహానికి. నిన్ను చేసుకుని అఘోరిస్తున్నానుగా ఇంకా సిగ్గులేక పెళ్లిచూపులు కూడా కావాలా ?”

“ఆ పెద్ద అఘోరించారులే! పెళ్ళికి ముందు అన్నీ కట్టుకధలే. పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించారు. తీరా చూస్తే చచ్చు స్టాయ్ గుమస్తా గిరి వెలగబెడ్తున్నారు. నన్ను బంగారంలా చూసుకుంటానని చెప్పి ఒక్క పసుపు  తాడు తోనే సరిపెట్టేసారు. ఒక ప్రక్క ప్రేమిస్తున్నట్టు నటించి ఇంకో ప్రక్క ద్వేషించటం మీకే చెల్లింది.”

“చాల్ల్లే మాటకి మాట చెప్పటం నేర్చుకున్నావ్  ముందా వంట విషయం చూడు. ఎప్పటిలా కూరలు మాడ్చేస్తే నా పరువు కాస్తా పోతుంది. ముందు ఆ దేభ్యం ముఖానికి కాస్త నవ్వు పులుముకో”

“ఏమిటండీ  ఇందాకట్నుంచీ చూస్తున్నాను. మాటికి మాటికి దేభ్యం మొహం దేభ్యం మొహం అంటూ ఈసడించి పారేస్తున్నారు . ముందు మీ మొహం అద్దంలో చూసుకోండి. తాటి పీచు లాంటి జుట్టు, గుంట కళ్ళు, మొహం  నిండా మొటిమలు, అన్నిటికి మించి కుసంస్కారం,  మాట జారుడు తనం. మీరూ మీ ఫ్రెండ్ ఏ గంగలో కలుస్తారో కలవండి. నేను మాత్రం ఈ రోజు వంట వండేది లేదు”

“చూడు శ్రీ రాం ఈ జంట   నిన్న గాక మొన్న ఒకరి కొకరు ఒకరిమీద ఒకరు గ్రాంధిక భాషలో అంత ప్రేమ కురిపించేసుకుని   ఈ జగత్తంతా తాము తప్ప ఎవ్వరూ లేరన్నట్టుగా మమైకమై పోయి  ఇంతలోనే  మొహమొహాలు చూసుకో లేనట్టుగా  దుర్భాషలాడు కున్నారెందుకు? అది  అంతే. భార్యా  భర్తల  మధ్య వచ్చేతగాదాలు ఆకాశంలో  మెరుపులూ, ఉరుములూ  లాంటివి. అవి శాశ్వతం  కాదు.    ఐతే ,  ఆ మర్నాడే వాళ్ళిద్దరూ ఒక కొత్త సినిమా చూస్తూ  ఒకరిమీద ఒకరు వాలిపోతూ తెరమీద దృశ్యాలను చూస్తూ పరవశించి పోవటం చూసాక  అప్పుడు అనిపించింది  కుటుంబంలో ప్రేమానురాగాలనుండి  శాశ్వతంగా ఎవ్వరూ దూరం కాలేరు అని”.

                                                        -5-

 కొన్ని   కుటుంబాలు మొదట్లో ఒకరిమీద ఒకరు ధారాళంగా ప్రేమను కురిపించుకోవడం, ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అన్నట్లుగా మమైకపోవడం, ఆ తర్వాత తర్వాత ఒకళ్లంటే ఒకళ్ళకు అసహ్యం పుట్టేటట్టు , మళ్ళీ జీవితంలో కలిసి జీవించ లేనంతగా దెబ్బలాడుకోవడం, అదంతా మర్చిపోయీ ఏమీ జరగా నట్టుగా మళ్ళీ దగ్గరవడం ,  చాలా కుటుంబాలలో సర్వ సామాన్యమైపోయింది . అంతేకాదు   ఈ జీవిత ప్రయాణంలో ఒకరికి తెలియకుండా ఒకరు తమ భార్య గురించి భర్త, భర్త గురించి భార్య బయట ప్రపంచంలో ఇతరుల దగ్గర పొగుడుతూనే వుంటారు అలా ఒకరినొకరు కాపాడుకుంటూనే వుంటారు. ఎవ్వరూ సంసారాన్ని నాశనం చేసుకోరు ఎక్కడో కొంతమంది తప్ప. సంసారంలో ఏమైనా సమస్యలున్నా బయట పడకుండా  జాగ్రత్త పడే వాళ్ళే ఎక్కువ. “ అంటూ తన దగ్గరగా చూసిన కొన్ని జీవితాల  గురించి  సుదీర్ఘంగా నిర్వచనం చెప్పి  ముగించాడు శ్రీకాంత్ .

ఆ రోజు శ్రీకాంత్  వెళ్లి పోయాక మా ఆవిడ నన్ను అడిగింది “ఏమండీ మీరు శ్రీకాంత్   చెప్పే విషయాలతో ఏఖీభవిస్తున్నారా ?” అని  .

“అవును అతను అన్నీ నిజాలే చెప్పాడు.ఎన్నో జీవితాల్ని కాచి వడపోసాడు . ఎందుకు అనుమానం ?

“  ఏమీ లేదు ఈ సమాజంలో అందరి జీవితాలను అవపోసన పట్టిన వాడు ప్రతి వ్యక్తి తన కుటుంబం కోసమే బ్రతుకుతున్నాడని ఘంటాపదంగా చెపుతున్న అతను మరి ఐదేళ్ళ క్రితం పెళ్ళానికి విడాకులెందుకు ఇచ్చాడుట ?  అంతే కాదు పెళ్ళైన   అతని చెల్లెలు ఏళ్ళు గడుస్తున్నా    మొగుడితో కాపురానికే వెళ్ళటం  లేదుట  .అసలు వాళ్ళ కుటుంబంలో భార్యలు భర్తల్ని భర్తలు భార్యల్ని వదిలేసినా ఉదంతాలు చాలా ఉన్నాయిట . కుటుంబ సౌఖ్యం లేక మనస్సాంతి కరువయ్యి వాళ్ళనీ వీళ్ళనీ పరిచయం చేసుకుని వున్నది లేనట్టుగా,లేనిదీ ఉన్నట్టుగా సృష్టిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడుట.” .

నేను ఆశ్చర్య పోతూ  “ఇన్ని విషయాలు నీకెలా తెలిసాయి ?” అంటూ   ఆసక్తిగా  అడిగాను .

“మీకు శ్రీకాంత్ తో పరిచయం గత మూడేళ్ళ నుండే . కాని అతను విడాకు లిచ్చిన అమ్మాయి నాకు ఐదేళ్ళకు పైగా    స్నేహితురాలు మరి. అయితే  కొన్ని  కారణాల వల్ల  వాళ్ళ  పెళ్ళికి  నేను  వెళ్ళలేదు  అనుకోండి   “ అంది  మా ఆవిడ  నన్ను నిలువునా అయోమయంలో పడేసి , .

xxxxxxx xxxxx

జీడిగుంట నరసింహ మూర్తి., ఫ్లాట్ నెంబర్ :401, సాయి లక్ష్మి ప్లాజా, అన్నపూర్ణ ఎన్క్లేవ్ , సాయిబాబా గుడి దగ్గర, చందానగర్, హైదరాబాద్ -500050 సెల్ : 9866187886
జీడిగుంట నరసింహ మూర్తి., ఫ్లాట్ నెంబర్ :401, సాయి లక్ష్మి ప్లాజా, అన్నపూర్ణ ఎన్క్లేవ్ , సాయిబాబా గుడి దగ్గర, చందానగర్, హైదరాబాద్ -500050 సెల్ : 9866187886

 

Share This Post

Leave a Reply