స్వాతంత్రానికి పూర్వం తెలుగు కథ – స్త్రీ పురుష సంబంధాలు – బి. గోపిర్యానాయక్


ఆదిమ కాలంలో ఒంటరి జీవితాన్ని ప్రారంభించిన ప్రాక్తన మానవుడు క్రమక్రమంగా సమిష్టి జీవితానికి అలవాటుపడ్డాడు.  పరిసరాల ప్రభావంతో నాగరికతను నేర్చుకున్నాడు.  సంస్కృతిని అలవర్చుకున్నాడు.  తోటి మానవులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు.  సంస్కృతి, సంబంధాలు కల్గిన మానవ సమాహారమే సమాజం.  కొన్ని కొన్ని సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, జీవన విధానం, విశ్వాసాలు, కళలు మొదలైన సాంస్కృతికాంశాలు మానవాళిలో కొందరికి సమానంగా ఉంటాయి.  అలాంటి సామాన్య సంబంధమున్న జన సమూహాన్నే సమాజమని వ్యవహరిస్తారు.  సమాజ సభ్యుల్లో ప్రతిఒక్కడికీ, తాను ఫలానా సమాజానికి చెందినవాడిననే స్పృహ ఉంటుంది.  ఈ స్పృహే ఆ సమాజం సభ్యులందరినీ ఒక్కతాట బంధిస్తుంది.

సమాజాలు అత్యంత ప్రాచీన కాలం నుండీ ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ప్రతి జాతిలోనూ ఉన్నట్లుగా దాఖలాలు కన్పిస్తున్నాయి.  అంతేకాక సామాజిక జీవనం మానవులకు మాత్రమే పరిమితం కాలేదు.  మానవేతరాలైన అల్ప జంతువుల్లోనూ, క్రిమికీటకాదుల్లోనూ సామాజిక జీవనం కనిపిస్తుంది.  ఉదాహరణకు చీమలు, తేనెటీగలు, కందిరీగలు వీటిలో గుంపుగా జీవించే విధానం ఉంది.  శ్రమ విభజన ఉంది.  సహకారం ఉంది.  కేవలం వీటిల్లోనే కాదు పక్షుల్లోనూ సమాజ జీవన లక్షణాలు గోచరిస్తాయి.  ఉదా:- సహయత్నాలు, శ్రమవిభజన, ఆధిపత్యం, అధీనత, భావ ప్రసారం మొదలైనవి.

ప్రేమ, ద్వేషం, సానుభూతి, వైషమ్యం, స్నేహం, మాత్సర్యం, సహజానుబంధం, సంతాపం, సుఖం, నిస్పృహ, సంబంధ స్పృహ, సామాజిక ఐకమత్యం అనేవి మానవ సమాజ మౌలిక లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

ఇతర జంతువులకు లేనిదొకటి మానవులకు దక్కింది.  అదే విచక్షణా జ్ఞానం.  ఇది వారి మనో వికాసానికి ప్రతీక.  పరస్పర చర్యా స్పృహ, పరస్పర సంబంధ సంగ్లిష్టతలు దీని అభ్యంతర లక్షణాలు.  అంతేకాకుండా మానవ సమాజంలో ప్రతి సభ్యుడూ స్వతంత్రుడు.  సంఘజలం సంజీవని వంటిది.  అందుకే శ్రీశ్రీ ‘వ్యక్తికి బహువచనం శక్తి’ అన్నాడు.

‘‘మానవుల సామాజిక ప్రవర్తనకు మూలం పునరుత్పాదన ప్రక్రియలోనే గమనించవచ్చు.  స్త్రీ పురుషుల సహకార సాన్నిహిత్య సాధన మొదలు లైంగిక వాంఛా పరితృప్తికి, శుక్ల శోణిత సంయోగానికి, గర్భస్ధ పిండ పోషణకు, శిశు వికాసానికి, శిశు సంరక్షణకు అన్ని దశలలోనూ ఒక జీవి మరొక జీవి మీద ఆధారపడి ఉండక తప్పదు.  సత్సంబంధాలు నెలకొల్పుకోక తప్పదు.  అనంతరం కౌమార యౌవన వార్థక్ దశలన్నిటా ఇదేస్ధితి కొనసాగుతుంది’’.  స్నేహదరాలు, ప్రేమానురాగాలు, సహాయ సానుభూతులు ప్రతి మానవుడూ కోరుకుంటాడు.  సామాజిక ప్రవర్తనలో ఆ అభిలాషను ప్రతిబింబింపజేస్తాడు.  సమాజ జీవనానికి అది ప్రాతిపదికగా నిలుస్తుంది.  వ్యష్టిగా సాధించలేని ప్రయోజనాలను సమిష్టిగా సాధించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది.  ఆ సాధన ప్రక్రియలో ఏర్పడ్డవే వివిధ సామాజిక రాజకీయ సంస్థలు.  కుటుంబం, కులం, వర్గం, సమూహం మొదలైన వ్యవస్థలను పరిరక్షించేది రాజ్యవ్యవస్థ.  దాని కార్య నిర్వాహక యంత్రాంగమే ప్రభుత్వం.  రాజ్య విధేయులైన పౌరులందరకీ హక్కులనూ, విధులనూ నిర్దేశించేది శాసన నిర్మాణ వ్యవస్థ.  వాటిని శాసన బద్ధంగా పరిషకరిస్తూ తీర్పులిచ్చేది న్యాయ వ్యవస్థ.  సమాజ సమిష్టికి వీటి రూపకల్పనలో ఎంత ప్రయోజనముందో, వీటి పరిరక్షణలో అంతే బాధ్యత ఉంది.  అందువల్ల సామూహిక ప్రయోజనాలకు దోహదకర్త అయిన సమాజమే కొన్ని స్వప్రయోజనాలకు నిరోధకరం అవుతుంది.  సమిష్టి ప్రయోజనాల ముందు వ్యష్టి ప్రయోజనాలు కొంతవరకు తల ఒగ్గక తప్పదు.  ఈ విధంగా వైయక్తిక, సామూహిక వర్తనలను రెంటినీ కూడా సమాజం నియంత్రిస్తుంది, అన్న పోరంకి దక్షిణామూర్తి మాటలు గమనార్హం.

ప్రతి వ్యక్తిలోనూ విలక్షణమైన మూర్తిమత్వం ఉంటుంది.  అది ఆత్మీయమైనది, అమూల్యమైనది.  ఏ ఇద్దరి మూర్తిమత్వాలూ ఒక్క తీరుగా ఉండవు.  ఈ విభేదాలు వయస్సు పెరిగే కొద్దీ మరింత విస్పష్టంగా రూపుగడతాయి.  సమాజీకరణ కారకాల ప్రభావం వల్ల ఇవి వికాసం చెందుతాయి.

‘‘వ్యక్తి ఆజన్మాంతం సమాజ సభ్యులే మనుగడకు ఆవశ్యకమైన ప్రేమాభిమానాలూ సహాయ సహకారాలూ భద్రతా అతనికి సమిష్టి జీవనంలోనే లభ్యమవుతాయి.  వ్యక్తి గతంగా అనుభవించే సుఖ దుఃఖానుభూతులకు సామాజిక ప్రేరకాలే కారకాలూ నివారకాలూ కూడా అవుతాయి.  తోటి వాళ్లతో కష్టసుఖాల్లో కలిసి ఉండని సమాజం ఊహకే అందదు.  మనిషి మనుగడకు ‘ప్రేమ’ ఒక్కటే ప్రాణం.  దాన్ని నలుగురిలో పంచుకోలేని వ్యక్తులు రోగగ్రస్తులు.  ఇందుకు పూర్తిగా వాళ్లను తప్పుపట్టనక్కరలేదు.  సామాజిక అవ్యవస్థలు వాళ్లను అలా తయారుచేస్తాయి.  సహకారానికిగా మారుస్పర్థ, ప్రేమానురాగాలకు మారుగా జాతివర్గ విద్వేషాలు, సామాజిక ప్రయోజనాలకు మారుగా సంకుచిత పాక్షిక ప్రయోజనాలు, విశ్వజనీనతకు బదులుగా అత్యధిక ధనార్జన ఆసక్తి వంటి తప్పుడు విలువలు ప్రాబల్యం వహించి, మానవుడి సామాజిక జీవనానికే సవాళ్లుగా ఎదైరై స్వతస్సిద్ధంగా అతనిలో ఉన్నమంచిని హరింపజేస్తున్నాయి.  దానికి చికిత్స కావాలి.  సదవగాహన, వినయం, సౌశీల్యం, ప్రేమ, సహీనుభూతి రూపుగట్టిన భిషగర్వులు అందుకు ఉద్యమించాలి.  ప్రపంచంలో ఎక్కడ ఏ ఒక్కడు బాధపడుతున్నా ప్రపంచం దానికి స్పందించాలి.  ఏ ఒక్కడు కన్నుమూసినా తానుకొంత తరిగిపోతున్నట్టు గ్రహించాలి.  లోకంలో ఎవ్వడూ ఏకాకి కాడని నిరూపణ కావాలి’’  అదే మానవ సమాజ ఉద్దేశ్యం అనే పోరంకి దక్షిణామూర్తి గారి మాటలు సమాజ వ్యవస్థ గొప్పదనాన్ని తెలియజేస్తాయి.

ఇలా సమాజాన్ని అర్థం చేసుకోకపోతే ఎంతటి వారికైనా సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం దుర్లభమవుతుంది.  సాహిత్యం అసలైన సామాజికతకు ప్రతిరూపం.  అందుకే అది వింతల్ని చూపిస్తూ నవ్విస్తుంది.  విశేషాల్ని చూపిస్తూ కవిస్తుంది.  విషమ సమస్యల్ని చూపిస్తూ భయపెడుతుంది.

ఏనాటి సాహిత్యంలో ఆనాటి సమాజం దర్శనమిస్తుంది.  ఆనాటి ప్రజల సామాజిక జీవితానికి ఆ సాహిత్యం ప్రతిబింబంగా వుంటుంది.  రచయిత తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సంఘటననూ, అనుభవాల్నీ తద్వారా తాను పొందిన ప్రతి మనోభావాన్ని తక్కిన సామాజికులతో పంచుకోవాలన్న ఆవేదన, తపన ప్రతి రచయితకు వుండాలి.  అప్పుడే అతని అనుభవాలు సాహిత్యరూపంలో సమాజంలోని తక్కిన వారందరికీ అనుభవమవుతుంది.  అత్యధిక సంఖ్యాక ప్రజల జీవితాల్ని స్పృశించి శాసించే సామాజిక శక్తులు, వివిధ అంశాల ప్రభావాల్ని లోతుగా అర్థం చేసుకోవాలి.  జీవితాన్ని గురించిన సూత్రాలు చాలా తెలుసుకోవాలి.  తన నిజ జీవిత అనుభవాల్ని ఆ సూత్రాలకు అన్వయించుకుంటూ జీవన సత్యాల్ని తరచి నిరూపించిన కథలు స్వాతంత్ర్యానికి పూర్వం వచ్చాయి.

స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు కథను పరిశీలించినట్లయితే సామాజిక జీవితంలోని వివిధ ధోరణులు, ప్రజాస్వామ్య ఆలోచనావిధానం, స్వరాజ్యకాంక్ష, స్త్రీ పురుష సంబంధాలు, ప్రజల అభిరుచులు, విద్య, సమాజపు లొసుగులు, …. ఇలా నిత్య జీవితంలోని అనేక నగ్నసత్యాలు పాఠకుల మనోఫలకంపై కదలాడతాయి.

ప్రజా జీవితంలోని అనేక అంశాలు సమాహారమే సమాజం.  సమాజాన్ని విడిచి సాహిత్యం జీవించలేదు.  సమాజం సజీవమైంది. సామాజిక స్పృహ కల్గిన రచయితలు సమాజంలో వచ్చిన పరిణామాలను స్వాతంత్ర్యానికి పూర్వం కథల్లో ప్రతిఫలింపచేశారు.  సామాజిక జీవన చిత్రణే ఆయా రచయితల కథలకి ప్రాణం.  సమకాలీన సమాజంలోని భావ సంచలనాలను అప్పటి రచయితలు తమ కథల్లో వెల్లడించారు.  కథల్లో సామాజిక సమస్యల మూలాలను, వాటి పరిష్కార మార్గాలను ఆవిష్కరించారు.  అందుకే ఈ అధ్యాయంలో స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు కథల్లోని స్త్రీ పురుష సంబంధాలను పరిశీలిద్దాం.

ప్రాచీన సమాజంలో మాతృ స్వామ్య సమాజం వుండేది.  ఆవ్యవస్థలో స్త్రీ కుటుంబానికి కేంద్రబిందువుగా వుండేది.  కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలపై ఆమెకు ఆధిపత్యం వుండేది.  దాంతో నాటి సమాజంలో స్త్రీకి సముచితమైన గౌరవం ఉండేది.  తదనంతర సామాజిక పరిణామంలో స్త్రీ స్థానం దిగజారుతూ వచ్చింది.  దీనికి కారణం స్త్రీకి ప్రకృతి రీత్యా వచ్చిన మాతృ లక్షణం.  ఆమె గర్భంతో వున్నప్పుడూ, పిల్లల్ని కన్నప్పుడూ ఇంటి పట్టునే వుండాల్సి వచ్చింది.  దాంతో ఆమె రోజువారీ ఉత్పత్తి శ్రమకు దూరమైంది.  ఈ సమయంలో పురుషుడు ఈ ఉత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహించేవాడు.  తద్వారా అతనికి ఉత్పత్తి సాధనాలపై, కుటుంబంపై అజమాయిషీ ఏర్పడింది.  ఈ క్రమం పితృస్వామ్య వ్యవస్థకు దారితీసింది.

పితృస్వామ్య వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలపై, కుటుంబంపై స్త్రీ పట్టుకోల్పోయింది.  దీంతో క్రమంగా కుటుంబంలో ఆమె స్థానం దిగజారింది.  ఆర్థిక స్వేచ్ఛనూ, స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది.  వ్యక్తిగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకూ దూరమైంది.  విద్యావిషయాల్లో కూడా రెండవ స్థానానికి చేరుకుంది.  అయినప్పటికీ కుటుంబానికి భార్యభర్తలే కేంద్రబిందువు.  భార్యభర్తలు ఒకొర్నొకరు అర్థంచేసుకుని కష్టసుఖాల్లో సహకరించుకోవాలి.  సంయమనంతో కుటుంబ అభివృద్ధికోసం పాటుపడాలి.  కానీ స్వాతంత్ర్యానికి పూర్వం కథల్లో పురుషుని స్థానంతో వివిధ రంగాల్లో పోల్చిచూసినపడు స్త్రీ స్థానం ఎక్కడ, ఏవిధంగా ఉంది?  స్త్రీ పురుష సంబంధాల్లో ప్రేమానురాగాలు – వైరుధ్యాలు ఎలా ఉన్నాయి?  స్త్రీ పురుషుల మధ్య నుండే ప్రకృతి సిద్ధమైన కోరికలు అటు ప్రేమానురాగాలకూ – ఇటు వైరుధ్యాలకూ కూడా మూల కారణమన్న మూలతత్వాన్ని ఈ సందర్బంగా విస్మరించలేం.  సమాజంలో సంపూర్ణ మానవులుగా జీవిస్తున్న ప్రతివారూ సమాజ అభ్యున్నతికి కృషిచేస్తారు.  అలా ఈ కథల్లో స్త్రీ పురుష సంబంధ బాంధవ్యాల్ని గురించి వివిధ కోణాల్లో చిత్రించటం జరిగింది.

తెలుగు కథా సాహిత్యంలో సంపూర్ణమైన కథాలక్షణాలు కలిగిన తొలికథ గురజాడ రాసిన ‘దిద్దుబాటు’ స్త్రీ పురుష సంబంధాలు – కుటుంబం – వైవాహిక జీవితానికి చిత్రించిన కథ.  కథలోని కమలిని కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి చేసిన ప్రయత్నమే ప్రధాన అంశం.

గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కథను అప్పటి వ్యవహారిక భాషలో రాశారు.  కథలోని గోపాల రావు పాత్ర ఆనాటి వ్యవహారిక భాషలోనే సంభాషిస్తుంది.  రాముడు పాత్ర ఆ వర్గానికి తగిన విధంగా మాండలిక యాసలో మాట్లాడుతుంది.  గోపాలరావు భార్య కమలిని పాత్రకు కథలో ఎక్కడా సంభాషణ వుండదు.  కానీ ఉత్తరం ద్వారా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతుంది.  చదువుకుంటే ప్రియునికి ఉత్తరాలు రాసి ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అని స్త్రీ విద్యను గూర్చి సందేహిస్తున్నపుడు, భర్తను మార్చడం కోసం ఉత్తరం రాసిపెట్టి, అతన్ని చక్కదిద్దుకుటుంది.  మారుతున్న కాలానికి తగినట్లుగా కథగా అక్కడక్కడా ఆంగ్లపదాలు మాండలిక యాసలో నడుస్తాయి.

గురజాడ వారు ‘దిద్దుబాటు’ ను ముచ్చటగా మూడు పుటల్లో ముగించారు.  కథానికకి క్లుప్తత, స్పష్టత ముఖ్యమనేది ఆయన అభిప్రాయం.  ఒక్క వాక్యం తీసేసినా చదువరులకు అర్థం కావాలి.  అంటే ఒక్క వాక్యం ఎక్కువ రాయకూడదన్నమాట.

‘దిద్దుబాటు’ కథలో వేశ్యా వ్యామోహంలో వున్న భర్తకు భార్యద్వారా జ్ఞానోదయం కలగటమే ఇందులోని ఇతివృత్తం.  ‘దిద్దుబాటు’ కథలో వినూత్నమైన ప్రారంభం, ఎత్తుబడి వుంది.  నాటకీయమైన ముగింపు ఉంది.  కథానికా నిర్వహణలో బిగివున్న అనుసంధానం, ఐక్యతా వుంది అంటారు ప్రముఖ సాహితీ విమర్శకులు శ్రీ జయంతి పాపారావు గారు.  కందుకూరి సంఘ సంస్కరణ ఉద్యమం, గిడుగు వారి వ్యవహారిక భాషోద్యమ ప్రభావం గురజాడ మీద వుండటం వలన సాహిత్యం ద్వారా సంస్కరణను ప్రారంభించారు.  అందుకే కన్యాశుల్కంతో పాటు, ‘దిద్దుబాటు’ లాంటి కథలను గురజాడ అప్పారావు సృష్టించగలిగారు.

‘దిద్దుబాటు’ కథలో రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన గోపాలరావుకు తలుపు తెరవలేదు.  ‘తలుపు! తలుపు!’ అంటాడు.  ఆవేళప్పుడు సాని దానింటి నుంచి ఆలస్యంగా వచ్చినందుకు బాధపడతాడు.  మళ్లీ అటువైపు వెళ్లకూడదనుకుంటాడు.  రాముడు తలుపు తీస్తే బావుంటుందని, నిశ్శబ్దంగా భార్య ప్రక్కకు వెళ్లి పెద్దమనిషి వేషం వేయొచ్చని అనుకుంటాడు.  చేత్తో తలుపును తోస్తాడు.  అది తెరుచుకుంటుంది.  ఇంట్లో అడుగు పెట్టిన గోపాలరావుకు ఎక్కడా దీపం కనిపించదు.  భార్య కమలినికూడా లేదు.  పాలేరు రాముణ్ణి అడగగా తెలీదని జవాబిస్తాడు.  గోపాలరావుకు ఇంట్లోనే ఉత్తరం కనిపిస్తుంది.  ‘నిజం తెలుసుకున్నాను.  మీకు స్వేచ్ఛకోసం, అబద్దాలు చెప్పే అవకాశం లేకుండా చేయడం కోసం, పుట్టినింటికి వెళ్లిపోతున్నానన్న’ సారాంశం అందులో వుంటుంది.  రాముణ్ణి భార్య పుట్టినింటికి వెళ్లి తీసుకురమ్మంటాడు.  తన పశ్చాత్తాపం భార్యకు తెలియజేయమంటాడు.  అయితే రాముడు – యేటా యేటా అదంతా నాకేం తెలదుబాబూ – నానంతాను – అమ్మా! నా మాటినుకోండి – కాలం గడిపినోణ్ణి.  ఆడోరు యజమాని చెప్పినట్టల్లా యిని వల్లకుండాలి – లేకుంటే మా పెద్ద పంతుల్లాగ అయ్యగారు కూడా సానమ్మనుంచుగుంతారు.  మీ శెవులో మాట పట్టంలోకి బంగారుబ్బొమ్మలాంటి సానమ్మవొచ్చింది.  మరి పంతులు మనసు మనసులో లేదు.  ఆపై మీ సిత్తం! అని చెపుతానంటాడు.గోపాలరావు కోపంతో కుర్చీమీంచి వురుకుతాడు.  రాముడు గది బయటకు జారుకుంటాడు.  మంచం కిందనుంచి కమలిని గలగల నవ్వుతూ బయటకు వస్తుంది.ఇలా పాత్రోచిత కథనంతో కథ నడుస్తుంది.  ఆ నాటి వ్యవస్థలో వేళ్ళునుకుపోయిన వ్యేశ్యావృత్తి ప్రధానంగా కథలో కనిపిస్తుంది.

స్త్రీకి విద్య ఎంత అవసరమో, అనివార్యతో ఈ కథలో చిత్రితమైంది.  కమలిని విద్యావంతురాలు కావడం వలన తన భర్త గోపాలరావును నాటకీయ పద్ధతి ద్వారా వేశ్యా వ్యామోహమనే వ్యసనం నుంచి విముక్తుణ్ణి చేస్తుంది.  సమకాలీన ఇతివృత్తంతో ఉన్నత లక్ష్యం, సంస్కరణాత్మకమైన మార్గంతో సాగిన ఈ కథ నూటికి నూరుపాళ్లు ఆధునికమైందని చెప్పవచ్చు.  అలాగే క్లుప్తత, స్పష్టత, అనుసంధానం, ఐక్యత, అనుభూతి, నాటకీయ స్పర్శ, పాత్రోచిత సంభాషణలతో ఆధునిక కథానికా స్వరూప స్వభావాలను పరిపూర్ణంగా సంతరించుకుని గురజాడ కలం నుండి ఆవిష్కరించింది.

భార్యా, భర్తల మధ్య నమ్మకం ఉండాలి.  ఒకరిమీద ఒకరికి అపనమ్మకం ఏర్పడితే, అపుడు ఏర్పడే అవాంఛనీయ దృశ్యాలు మనసును బాధిస్తాయి.  తరతరాల నుంచి స్త్రీ స్వేచ్ఛా రాహిత్యానికి బలిపశువవుతోంది.  సొంత ఆలోచన, జీవన విధానం వున్నప్పటికీ వాటిని కాలదన్ని పురుషుని నీడనే జీవించాలనేదే శ్రేయస్కరమనీ, అలా సమస్యల పట్ల రాజీపడి స్త్రీలు తమ బతుకును వెళ్లదీస్తున్నారు.  ఆ విధంగా స్త్రీజాతి స్వేచ్ఛకు దూరంగా జీవించడానికి అలవాటు పడిపోయింది.  మాడపాటి హనుమంత రావు రచించిన ‘‘హృదయశల్యం’’ కథలో చారిత్రాత్మకమైన నేపథ్యంలో స్త్రీ స్వేచ్ఛారాహిత్య సమస్య చిత్రించబడింది.

మన సమాజంలో స్త్రీ జీవితం బాల్యం నుంచి ఎంత అస్తవ్యస్త్యంగా కొనసాగుతున్నదో అనే విషయాన్ని చిత్రించిన కథ గుడిపూడి యిందుమతి రాసిన ‘‘విద్యావతి’’. రైలులో ప్రయాణిస్తున్నపుడు మాటల్లోని ఆనాటి విషయాల గురించి, ఆ ప్రయాణంతోపాటు ‘కథనం’ కొనసాగుతుంది.‘విద్యావతి’ కథ పూర్తి సంభాషణ పద్ధతిలోనే కొనసాగింది.  ఒక నేపథ్యంతో ఈ కథ చిత్రితమైంది.  అది ఒక సామాజిక నేపథ్యం.  రైలు ప్రయాణం ద్వారా ప్రయాణీకుల్లో చర్చకు వచ్చిన అనేక అంశాలు నాటి నుండి నేటి వరకు స్త్రీ జనోద్ధరణకు ఉపకరించేవే.

శ్రమేతర సౌందర్యపట్ల అవగాహన కలిగించే కథ నోరి నరసింహం రాసిన ‘‘గులాబి పువ్వు’’.  సాహితీ విమర్శకులు ఈ కథ భావ వాద ప్రభావం లోంచి వచ్చిందంటారు. ప్రకృతిని పరిపూర్ణంగా ప్రేమించిన ఆమె జీవితాన్ని అంతే ప్రేమించింది.  భర్త మనస్సులో గులాబి పువ్వులా ప్రేమకు ప్రతిరూపంగా నిలబడింది.  సౌందర్యాన్ని ఆరాధించిన ఆమెకు గులాబీలంటే చాలా ఇష్టం.  ఎప్పుడూ గులాబీలనే తన ఒంటి మీద ధరిస్తుంది.  అత్తగారు నగలు ధరించమని అంటుంది.  అత్తగారి కోరిక మేరకు తనకు ఇష్టమైన గులాబీలను కాదని నగలు ధరిస్తుంది.  ఆ రోజు నుండి ఆమె ఆరోగ్యం క్షీణించిపోతుంది.  మనోవేదనకు గురైన ఆమె రోజు రోజుకు అనారోగ్యం పాలవుతుంది.

ఒకప్పుడు మానవుడు ప్రకృతి సౌందర్య ఆరాధకుడు.  కానీ రాను రాను మనిషికి కృత్రిమ సౌందర్యం పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది.  ఎక్కడైనా అదే కనిపించడంతో ఆవేదన కలుగుతుంది.  శ్రమకు సౌందర్యమే ప్రధానమని ఈ కథ తెలియజెపుతుంది.

ఒకప్పుడు సంఘ సంస్కర్తలు వితంతు వివాహాలను ప్రోత్సహించారు.  ఆ నేపథ్యంలో తెలుగు కథలో కూడా వితంతు వివాహాలను సమర్ధిస్తూ చింతా దీక్షితులు ‘‘రైలు బండిలో ప్రేమ’’ అనే కథను రాశారు.  ఇది ప్రథమ పురుషలో సాగిన కథ.  హాస్యధోరణిలో కథనం కొనసాగింది. ఆనాడు సంఘ సంస్కరణోద్యమ నేపధ్యంలో, వితంతు వివాహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రాయబడిన కథ ఇది.  కథకుడు చింతాదీక్షికులు ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించడం కోసం కథనంలోహస్యధోరణిని అవలంబించాడు.  కథకు అనుగుణంగా అప్పారావుకు మెల్ల కన్ను.  సందర్భాను సారంగా ఎవరెవరి మీద అతని దృష్టి పడిందో, అది ఎలా వున్నదో, అలాగే ప్రయాణీకుల వస్త్రధారణ, వారి హావభావాలు, అప్పారావు, నరసాంబల వర్ణన, వారి మధ్య జరిగిన చూపుల సంభాషణ ఇలా కథలో ఎన్నో అంశాలకు వర్ణన అంతా హాస్యరస ప్రధానంగా సాగింది.

బాల్య వివాహాలు, మేనరిక వివాహాలు మంచివి కావని, స్త్రీకి అన్నివైపుల హానికరంగా మారుతుందని మరుపూరు పిచ్చిరెడ్డి రాసిన ‘‘పుట్టినింటికి నాకు ఋణం తీరింది’’ కథ ద్వారా తెలియవస్తుంది.  రచయిత ఈ కథను చాలా సమర్థవంతంగా నడిపాడు.

ఆ నాడు సంఘ సంస్కరణ కోసం ఎన్నో ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కందుకూరి వీరేశలింగం లాంటి సంస్కర్తలకు ఇలాంటి దశలో ఎన్నో కష్టనష్టాలు వచ్చాయి.  మార్పు కావాలనే ఆలోచనను ప్రజలు ఆహ్వానించటానికి ముందు ప్రయత్నం చేశారు.  తర్వాతే అది ఆచరణలోకి వస్తుంది.  మొదటి దశ ఆలోచనను ఆహ్వానించటం.  అది కమల పాత్ర ద్వారా రచయిత చిత్రించారు.

దేశమంతటా ప్రారంభమైన సంస్కరణ ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా నెమ్మదిగా సమాజంలో ప్రవేశించి, సత్ఫలితాలను సాధించాయి.  ఆనాడు విశృంఖలంగా వున్న బాల్య వివాహాలు, కన్యాశుల్కం ఇప్పుడు లేవు.  వితంతువులకు మరలా వివాహాలు జరుగుతున్నాయి.  స్త్రీ విద్యకు ప్రాముఖ్యత ఏర్పడింది.  మేనరికాలు జన్యుపరంగా మంచిది కాదని తేలడంతో ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది.  కానీ వ్యభిచారం, మద్యపానం, వరకట్నం లాంటి దురాచారాలు ఇప్పుడు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి.

ఈ కథ ఒక ఆలోచనను మనసులో కలిగించి, దురాచారాలను అరికట్టి సమాజాన్ని సవ్యమైన మార్గంలో నడిపేందుకు ఉపకరిస్తుంది.

ఈ విధంగా స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు కథలో స్త్రీ పురుషసంబంధాలు చిత్రితమయ్యాయి.

Share This Post

Leave a Reply